https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/boy.jpg?itok=RC3f1oRl
బోరుబావి వద్ద సహాయక చర్యల్లో పోలీసులు. (ఇన్‌సెట్లో) సాయివర్ధన్‌

బోరుబావిలో బాలుడు



సాక్షి, మెదక్‌/పాపన్నపేట : వ్యవసాయ పొలంలో అప్పుడే వేసిన బోరుగుంత ఆ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. తాతతో కలసి బుడిబుడి అడుగులు వేస్తూ ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు రెప్పపాటులో బోరుగుంతలో పడిపోయాడు. లోపలికి వెళుతున్న క్రమంలో డాడీ.. డాడీ అంటూ రోదించిన తీరు కలచివేసింది. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగళి భిక్షపతి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు నవీన, భార్గవి. నవీనను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన గోవర్ధన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమారులు. ఇందులో చిన్నవాడైన సంజయ్‌ సాయివర్ధన్‌ (3) ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. ఫొట్రోగాఫర్‌ వృత్తితో కుటుంబాన్ని పోసిస్తున్న గోవర్ధన్‌ ఐదు నెలల క్రితం భార్య, పిల్లలను తన అత్తగారిల్లయిన పొడిచన్‌పల్లికి పంపించాడు. అప్పటి నుంచి నవీన తన పిల్లలతో ఇక్కడే ఉంటోంది.

ప్రాణం మీదకు తెచ్చిన బోర్లు..
సాగు కోసం నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో భిక్షపతి తనకున్న పొలంలో బోర్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్గవి, నవీనాతోపాటు పిల్లలు పొలానికి వచ్చారు. మంగళవారం రాత్రి 160 ఫీట్ల వరకు ఒక బోరు వేయగా.. నీళ్లు పడలేదు. మళ్లీ వేరే స్థలంలో బుధవారం ఉదయం 300 ఫీట్ల వరకు వేశారు. అక్కడ కూడా నీరు పడకపోవడంతో చివరగా ఇంకో చోట 150 ఫీట్ల లోతు వరకు బోరుగుంత తవ్వినా.. ఫలితం లేకపోయింది. దీంతో వేసిన కేసింగ్‌ తీసేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇంటి బాట పట్టారు. తాత భిక్షపతితో కలసి బాలుడు సంజయ్‌ సాయివర్ధన్‌ వస్తున్నాడు. తాత కంటే ముందు వెళ్తున్న బాలుడు ప్రమాదవశాత్తు జారి బోరుగుంతలో పడిపోయాడు. 

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/28/medak.jpg

సంఘటన స్థలంలో రోదిస్తున్న సంజయ్‌ తల్లి నవీన
చీర, దోతి కట్టి లోపలికి వేసినా.. 
బాలుడు బోరుగుంతలో పడిన వెంటనే భిక్షపతి అయ్యో అయ్యో అంటూ ఏడవటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే చీర, దోతికి ముడేసి బోరుగుంత లోపలికి పంపారు. అయినా ఫలితం లేకపోయింది. నాలుగైదు నిమిషాలపాటు బాలుడు డాడీ.. డాడీ.. అంటూ ఏడ్చాడని.. ఆ తర్వాత ఏం వినబడలేదని కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక ఫైరింజన్, రెండు 108 వాహనాల్లో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని బోరుగుంతలోకి ఆక్సిజన్‌ పంపించారు. ముందుగానే చేరుకున్న రెండు జేసీబీలతో బోరుగుంతకు సమాంతరంగా తవ్వకం మొదలుపెట్టారు. రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. 

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/28/father.jpg

చిన్నారి తండ్రి గోవర్ధన్‌ 

25 నుంచి 50 అడుగుల లోతులో ఉన్నట్లు.. 
బోరుబావిలో పడిన బాలుడు 25 నుంచి 50 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందం గుర్తించింది. బోరుబావి 150 అడుగుల లోతు ఉందని.. బోరుబావికి వినియోగించిన కేసింగ్‌ 40 అడుగుల వరకు మాత్రమే వేసినట్లు తెలుస్తోంది. అయితే నీళ్లు పడకపోవడంతో కేసింగ్‌ను తీసేశారని.. ఆ మేరకు బాలుడు కేసింగ్‌ వేసినంత దూరం వెళ్లి అక్కడ చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో బాలుడికి రక్షించేందుకు హైదరాబాద్‌ నుంచి ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (జాతీయ విపత్తు నిర్వహణ ఫోర్స్‌) బృందం పొడిచన్‌పల్లికి చేరుకుంది. రెండో బృందం ఆంధ్రపదేశ్‌లోని గుంటూరు నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

మిన్నంటిన రోదనలు
ఘటనా స్థలం వద్ద బాధిత బాలుడి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. బాలుడు సాయివర్ధన్‌ ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు.