దడదడలాడించిన చమిందా వాస్
- వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు
- 38 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
- 100 ఓవర్ల మ్యాచ్... 20 ఓవర్లకే సమాప్తం
ఇప్పుడు మనమంతా టి20 మెరుపుల్ని తెగ చూసేస్తున్నాం. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ హిట్లు... షాట్లపైనే మన కళ్లుంటాయి. ఏ ఓవరైనా సిక్స్‌లు, ఫోర్లతో నిండిపోతే దాని గురించి కాసేపైనా చర్చించుకుంటాం. కానీ బౌలింగే ఎప్పుడూ ఎడారై పోతుంటుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్లో బౌలరెప్పుడూ బలిపశువుగానే కనబడతాడు. కానీ 19 ఏళ్ల క్రితం ఓ పేసర్ తన బౌలింగ్‌తో ఏకంగా ఓ జట్టునే బలిచేశాడు. 100 ఓవర్లు జరగాల్సిన వన్డే మ్యాచ్‌ను 20 ఓవర్లలోనే ముగించాడు. ఈ సంచలన ధీరుడు లంక సీమర్ చమిందా వాస్ కాగా... బలైంది జింబాబ్వే!
కపిల్‌దేవ్ 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ఆడిన 175 పరుగుల ప్రదర్శనను ఎవరైనా మర్చిపోతారా? వన్డేల్లో సచిన్ క్రికెట్ పుటలకెక్కించిన ద్విశతకం గుర్తుండనిది ఎవరికి? టెస్టుల్లో ముల్తాన్ సుల్తాన్ అయిన సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ ఎన్నేళ్లయినా మన బుర్రల్లోంచి డిలీట్ అవుతుందా? కచ్చితంగా కావు కదా! ఇవన్నీ అసాధారణమైనవి. కానీ బ్యాట్‌తోనే చిరకాలం గుర్తుండిపోయేవి. మరీ బౌలింగ్‌లో లేవా అంటే ఉన్నాయి. టెస్టు చరిత్రలో మన అనిల్ కుంబ్లే పదికి పది వికెట్లు. మరి వన్డేల్లో ఈ దారిలోకొచ్చిన సీమర్ ఉన్నాడు. అతడే శ్రీలంక బౌలర్ చమిందా వాస్. అతని పేస్ పదునుకు పదికి పది తీయకపోయినా... అంతపనీ చేసేశాడు. మురళీధరన్ ఆఖరి రెండు వికెట్లను వరుస బంతుల్లో తీయకపోయుంటే వన్డేల్లో వాస్ మరో కుంబ్లే అయ్యేవాడు. అయినప్పటికీ ఎవరూ అందుకోలేని రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు వాస్ పేరిటే ఉంది.
బ్రేక్ లేకుండా...
జింబాబ్వేతో 2001 డిసెంబర్‌లో ఈ మ్యాచ్ జరిగే సమయంలో శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు వేడెక్కి ఉన్నాయి. ఎన్నికలు, ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ పంజా నేపథ్యంలో పోలీసులు కొలంబోలో దాదాపు కర్ఫ్యూ విధించే పరిస్థితి నెలకొంది. అయితే పొద్దంతా సాగే మ్యాచ్‌ను వాస్ తన పేస్‌తో ఓ పూటకే ముగించడంతో పోలీసులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగినా... ఖాతా తెరిచింది మాత్రం వాస్. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే ఇబ్రహీమ్ ఎల్బీగా డకౌటయ్యాడు. ఈ దెబ్బకు జింబాబ్వే 2 ఓవర్లదాకా ‘పరుగే’ పెట్టలేదు. మళ్లీ తన మూడో ఓవర్లో (ఇన్నింగ్స్ 5వ) ఫ్లవర్ సోదరులు గ్రాంట్ (1), ఆండీ ఫ్లవర్ (0)లను పెవిలియన్ చేర్చాడు.
దీంతో వాస్ బ్రేక్ లేకుండా వరుసగా తన బౌలింగ్ స్పెల్‌ను కొనసాగించాడు. అప్పటికే 3 వికెట్లు తీసిన లంక పేసర్ 11వ ఓవర్లో హ్యాట్రిక్ దెబ్బకొట్టి వికెట్లను డబుల్ చేసుకున్నాడు. వరుస బంతుల్లో కార్లయిజ్ (16), విషార్ట్ (6), తైబు (0)ల ఆట కట్టించాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హీత్ స్ట్రీక్ (0)ను, మరుసటి ఓవర్లో ఎన్కల (1)ను వాస్ ఔట్ చేశాడు. అప్పుడున్న ఏకైక పవర్‌ప్లే (15 ఓవర్లు) ముగిసేసరికి జింబాబ్వే స్కోరు 37/8. ఆ ఎనిమిది వికెట్లు వాసే తీశాడు. 16వ ఓవర్ వేసిన మురళీధరన్ వరుస బంతుల్లో ఫ్రెండ్ (4)తో పాటు ఒలాంగ (0)ను ఔట్ చేయడంతో జింబాబ్వే 15.3 ఓవర్లలోనే 38 పరుగులకే ఆలౌటైంది. ఇది వన్డే చరిత్రలో అత్యల్ప స్కోరుగా పాకిస్తాన్ (43 ఆలౌట్) రికార్డును చెరిపేసింది.
కోటా పూర్తయితే పదికి బాట పడేదేమో!
ఇటు నుంచి చమిందా నిప్పులు చెరుగుతుంటే ఆట సాగేకొద్దీ ఆడే బ్యాట్స్‌మెన్ కరువయ్యాడు. అందుకే క్రీజ్‌లో నిలిచే సాహసం ఎవరు చేయలేకపోవడంతో అతని కోటా కూడా పూర్తి కాలేదు. ఒకవేళ 10 ఓవర్ల కోటా వేసి ఉంటే మాత్రం కచ్చితంగా పదికి పది వికెట్ల రికార్డు... కుంబ్లేలాగే వన్డేల్లో వాస్ పేరిట పదిలమయ్యేది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనను శ్రీలంక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 4.2 ఓవర్లలో 40/1 స్కోరుతో జయభేరి మోగించింది. ఇంకా 45.4 ఓవర్లు అంటే 274 బంతుల్ని మిగిల్చి అసాధారణ విజయాన్ని నమోదు చేసింది.
జింబాబ్వే ఆడిన ఓవర్లు 15.4 కాగా... లంక ఎదుర్కొన్న 4.2 ఓవర్లు కలిపితే సరిగ్గా 20 ఓవర్లకే ఈ వన్డే ముగిసింది. అంటే ఈ తరం టి20లో సగం ఆటకే ముగిసిందన్నమాట! బంతుల (120) పరంగా వేగంగా ఫలితం వచ్చిన మ్యాచ్‌గా ఇది రికార్డు పుస్తకాల్లోకెక్కింది. 19 ఏళ్లపాటు ఈ రికార్డు నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న అమెరికా (12 ఓవర్లలో 35 ఆలౌట్) నేపాల్ (5.2 ఓవర్లలో 36/2) జట్ల మధ్య వన్డే మ్యాచ్ 104 బంతుల్లో ముగియడంతో శ్రీలంక–జింబాబ్వే జట్ల పేరిట ఉన్న రికార్డు బద్దలైంది.