ఈ సమయంలో ఐపీఎల్‌తోనే ఆదరణ సాధ్యం
హోబర్ట్ : ఈ ఏడాది తమ దేశంలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే దాని స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)13వ సీజన్ నిర్వహిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్ జరుగాలని తాను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయని బుధవారం చెప్పాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో అత్యంత విలువైన విదేశీ ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచాడు.('ధోని ప్లాన్ మాకు కప్పును తెచ్చిపెట్టింది')
'ఐపీఎల్ జరుగాలని నేను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ టోర్నీని చూస్తారు. క్రికెట్ చాలా కాలంగా నిలిచిపోయాక ఐపీఎల్ జరిగితే మరింత ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ టోర్నీ చాలా గొప్పది. వీలైంత త్వరగా మళ్లీ క్రికెట్ ఆడాలని తాను ఎదురుచూస్తున్నా' అంటూ కమిన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడనున్నది. 2022 సంవత్సరానికి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ వాయిదాపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ ఆ టోర్నీను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రకాల క్రీడా టోర్నీలు రద్దు అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌ను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే.