కరోనా కన్నా అవే ప్రమాదకరం
సాక్షి, న్యూఢిల్లీ : ‘కరోనా మహమ్మారి వైరస్ గురించి భారతీయులు అస్సలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ మిశ్రమాన్ని తీసుకుంటే వైరస్ నిర్వీర్యం అవుతుంది... రోజూ అల్లం తీసుకున్నా లేదా నిమ్మకాయ రసం తాగినా వైరస్ మన జోలికి రాదు... రోజూ లేవగానే ఒకసారి, ఆ తర్వాత రెండు, మూడు సార్లు వేడి నీళ్లు తాగితే మన జోలికి రాదు... కీటో డైట్ తీసుకుంటే కరోనా పరారీ... రామ్‌దేవ్ బాబా చెప్పినట్లు కరోనా బాధితులు ముక్కులో రెండు, మూడు ఆవ నూనె చుక్కలు వేసుకుంటే కరోనా వైరస్ చనిపోతుంది... ఆఫ్రికా సంప్రదాయ వైద్య రసాలను తీసుకుంటే వైరస్ ఆచూకీ లేకుండా పోతుంది... 5 జీ సెల్ టవర్స్ కరోనాను వ్యాప్తి చేస్తున్నాయి... వ్యాక్సిన్ అమ్మడం కోసం బిల్‌గేట్స్ పన్నిన కుట్ర ఫలితమే కరోనా... ప్రపంచాన్ని కబళించాలనే ఉద్దేశంతో చైనా ల్యాబ్‌లో తయారు చేసిన వైరస్ కరోనా...’ అంటూ సోషల్ మీడియా నిండా తప్పుడు సమాచారం లేదా నకిలీ వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి.
ఈ ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఇన్‌ఫోడమిక్’ పోకడగా అభివర్ణించింది. నిర్ధారించని వార్తలను లేదా నకిలీ వార్తలను ప్రచారం చేయడం కరోనా మహమ్మారీకన్నా ప్రమాదకరమైనదని హెచ్చరించింది. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ వార్తలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఎప్పటికప్పుడు తప్పుడు వార్తలను సోషల్ మీడియా నుంచి తొలగించాల్సిందిగా ఐటీ సంస్థలకు సూచించింది. అంతేకాకుండా నకిలీ వార్తలను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ‘ఈపీఐ–డబ్లూఐఎన్’ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది. (శ్రామిక రైళ్లలో ఆకలి కేకలు!)
ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగా మొదటి దశలో తప్పుడు వార్తను వెతికి పట్టుకుంటోంది. రెండో దశలో ‘కోవిడ్–19 పాయింటర్ రిసోర్సెస్, కోవిడ్–19 అలర్ట్ ఆన్ గూగుల్, కరోనా వైరస్ డిసీస్ ఇన్ క్యూబెక్ వెబ్‌సైట్’లోకి వెళ్లి అసలు సమాచారాన్ని సేకరిస్తోంది. మూడవ దశలో వాస్తవ సమాచారాన్ని ప్రజలకు వెల్లడిస్తోంది. ఉదాహరణకు అల్లం తింటే కరోనా తగ్గుతుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన వార్తను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, అల్లంలో అలిసిన్, అలిల్ ఆల్కహాల్ అనే రసాయనాలు ఉన్నాయని, వాటికి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసే శక్తి ఉంది తప్పా, వైరస్‌ను నిర్వీర్యం చేసే శక్తి లేదని, మెర్స్, సార్స్, కరోనాలపై జరిపిన ప్రయోగాల ద్వారా నిర్ధారణ అయిన విషయాన్ని మూడవ దశలో ప్రజలకు తెలియజేసింది. ఇలాంటి నిజాల కోసం ‘వాట్సాప్’లో హెల్త్ అలర్ట్‌ను, ఫేస్‌బుక్‌లో చాట్‌బోట్‌ను నిర్వహిస్తోంది.
పైగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పట్టుకోవడం ప్రపంచంలోని ప్రతి పౌరుడి కర్తవ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుకు పంచశీల సూత్రాలను కూడా సూచించింది.
1. ప్రతి వార్తను విమర్శనాత్మక దృష్టితో చూడాలి.
2. వార్త తప్పని తెలిస్తే మౌనం పాటించరాదు. ఆ వార్తను తొలగించాల్సిందిగా వార్తను పోస్ట్ చేసిన వ్యక్తిని కోరాలి.
3. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ అడ్మినిస్ట్రేటర్లకు ఫిర్యాదు చేయాలి.
4. ఏమన్నా సందేహాలు వస్తే నివృత్తి చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలి.
5. తప్పుడు సమాచారం ఇచ్చే వారికన్నా పెద్ద గొంతుతో వారి సమాచారాన్ని ఖండించాలి.
సంక్షోభ సమయాల్లో తప్పుడు వార్తలను కనిపెట్టేందుకు మరోపక్క ఐక్యరాజ్య సమతి 45 దేశాల నుంచి ‘వంద ప్యాక్ట్ చెక్కర్స్’ను ఎంపిక చేసి, వాటితో ‘ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెక్కర్స్ నెట్‌వర్క్’ను ఏర్పాటు చేసింది.