https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/gyawali.gif?itok=SSKhpJCP

మ్యాపుల వివాదం.. నేపాల్‌ ప్రధానికి షరతులు!



ఖాట్మండూ: కొత్త మ్యాపుల ప్రచురణకై పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీకి బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సభలో తగినంత బలం లేకపోవడం(మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం)తో అధికార పార్టీకి నిరాశ ఎదురైంది. బిల్లు నెగ్గించుకునేందుకు తొమ్మిది మంది సభ్యుల అవసరం ఉండగా.. నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అధికార పక్షానికి షాకిచ్చింది. దీంతో చర్చ జరుగకుండానే సభ వాయిదా పడింది. ఈ క్రమంలో భారత్‌తో వివాదానికి కారణమైన లిపులేఖ్‌, లింపియధుర, కాలాపానీ ప్రాంతాలను నేపాల్‌ భూభాగంలో ఉన్నట్లుగా రూపొందించిన మ్యాపుల ప్రచురణ మరింత ఆలస్యం కానుంది. 

నమ్మకం ఉంది..
ఇక ఈ విషయంపై స్పందించిన నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ గ్యావాలీ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. తాము ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘రేపు బడ్జెట్‌ ఉంది. కాబట్టి శుక్రవారం మరోసారి ఈ బిల్లు సభ ముందుకు వస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచాం. కాబట్టి త్వరలోనే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకుంటాం. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మాతో కలిసి వస్తాయని నాకు నమ్మకం ఉంది’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్‌?!)

ప్రధానికి షరతులు..!
కాగా ఇటీవల భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి.. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలని 33 మంది సభ్యులు కలిగిన మధేశీ(పూర్వకాలంలోనే నేపాల్‌కు వెళ్లి స్థిరపడిన భారతమూలాలున్న ప్రజలు) పార్టీలు షరతు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2015-16లో నేపాల్‌ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన పౌరసత్వ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా సదరు పార్టీలు కోరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.(అవసరమైతే యుద్ధానికి సిద్ధం.. కానీ: నేపాల్‌ మంత్రి)

అదే విధంగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ సైతం సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం మీదే తమ విధానం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ప్రస్తుత బిల్లును హోల్డ్‌లో పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక నేపాల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారత్‌ నిశితంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘సరిహద్దు వివాదాలు సహజంగానే ఎంతో సున్నితమైనవి. పరస్పర నమ్మకం, పూర్తి విశ్వాసం ఉన్నపుడే ఇరు వర్గాల మధ్య సఖ్యత చేకూరుతుంది’’అని పేర్కొన్నాయి.