లేఆఫ్స్‌పై ముఖ్యమంత్రికి టెకీల లేఖ
- ఐటీ కంపెనీల నిర్వాకంపై ఉద్యోగుల గగ్గోలు
ముంబై : కోవిడ్-19 సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు, వేతన కోతలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఐటీ ఉద్యోగుల యూనియన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసింది. ఐటీ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని సీఎంను ఈ లేఖలో అభ్యర్ధించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు కోవిడ్-19 సాకుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయని, వారి జీతాలను ఇవ్వకుండా, కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని జాతీయ ఐటీ ఉద్యోగుల సెనేట్(ఎన్‌ఐటీఈఎస్) సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొంది.
ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎన్‌ఐటీఈఎస్ ప్రధాన కార్యదర్శి హర్‌ప్రీత్ సలూజా అన్నారు. ఇలాంటి పరీక్షా సమయంలో ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాపాడేలా ఆయా కంపెనీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని లేఖలో కోరింది.