‘మీడియా నియంత్రణ చట్ట పరిధిలో ఉండాలి’
సాక్షి, విజయవాడ: సమాచార, ప్రసార మధ్యమాల నియంత్రణ చట్టం పరిధిలో ఉండాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాలు నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తున్నాని తెలిపారు. ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యానాలు వల్ల సమాజంలో అలజడి రేగుతోందన్నారు. వ్యక్తిగత దూషణల నుంచి మొదలై వైషమ్యాల వైపు దారి తీస్తున్నాయని తెలిపారు. అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిది కాదన్నారు. వాటిని అరికట్టేందుకు శాఖాపరమైన వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని వివరించారు. సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం వింగ్‌లో సోషల్ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదులపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని డీజీపీ చెప్పారు.
మాధ్యమాల్లో రాజ్యాంగ బద్ద సంస్థల పట్ల, ఆ సంస్థల నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల వ్యాఖ్యలు చేయడం సరికాదని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ప్రచురించే, ప్రసారం చేసే సమాచారం, అభిప్రాయాల వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలని తెలిపారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవ్వడం, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయడం, ప్రచురించడం సరికాదన్నారు. అశ్లీల, అసభ్యకర, నిందాపూర్వక, అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేయడం గర్హనీయమన్నారు. తీరు మార్చుకోకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవు హెచ్చరించారు. పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వ్యక్తులను ఉపేక్షించదని, నిష్ఫక్షపాతంగా ముందుకు వెళుతుందని చెప్పారు. హైకోర్టు తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారని, న్యాయస్థానం ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తుల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్న వారి మీద పోలీసుల నిఘా ఉందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.