మంథని జైలు మరణంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: మంథని పోలీస్‌స్టేషన్‌లో ఆవరణలో మంగళవారం చోటుచేసుకున్న నిందితుడి అనుమానాస్పద మృతిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. శీలం రంగయ్య అనే వ్యక్తిని లాకప్ డెత్ చేశారంటూ న్యాయవాది నాగమణి రాసిన లేఖ ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు మంథని జైలు మరణం ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎంక్వయిరీ కమిషన్ అధికారిగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్‌ను నియమించింది. జూన్ 2 వరకు నిందితుడి అనుమానాస్పద మృతిపై సమగ్ర నివేదిక అందించాలని ఎంక్వయిరీ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది.
(చదవండి: పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య)
మృతిపై అనుమానాలు లేవు..
మరోవైపు శీలం రంగయ్య మృతిపై అతని కుటుంబ సభ్యుల వాదన భిన్నంగా ఉంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్య పల్లె గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి.. ‘మా నాన్న మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవు. పోలీసులు కొట్టలేదు. నేను మా బాబాయ్ కలిసి చూసాం’ అని రంగయ్య కుమారుడు అనిల్ పేర్కొన్నాడు. తమ తండ్రి చావును రాజకీయం చేయొద్దని వేడుకున్నాడు. ‘మా అనుమతి లేకుండా బయటివారు.. స్వలాభం కోసం కేసు వేసి మమ్మల్ని బయటకీడుస్తున్నారు’అని రంగయ్య కుటుంబ సభ్యులు వాపోయారు. వీలైతే ఆర్ధిక సహాయం చేయండని, ప్రభుత్వం నుంచి కూడా సాయాన్ని ఆశిస్తున్నామన్నారు. కాగా, శీలం రంగయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శించారు.
(చదవండి: బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు!)