https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/former.jpg?itok=SJzWwQhc

క్యూలోనే కుప్పకూలిన రైతు



భోపాల్‌ : పంటను అమ్ముకునేందుకు ఆరు రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిలిచిన రైతు గుండెపోటుతో మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అగర్‌ మాల్వా జిల్లాకు మల్వాసా గ్రామానికి చెందిన రైతు ప్రేంసింగ్ మండువేసవిలో ఆరు రోజుల పాటు తన గోధుమ పంటను అమ్ముకునేందుకు తూకం కోసం క్యూలో వేచిచూస్తూ కుప్పకూలిపోయాడు. సరిగ్గా తన గోధుమలను తూచే సమయానికే ప్రేంసింగ్‌ విగతజీవిగా మారడం పలువురిని కదలిచింది. కొనుగోలు కేంద్రాల వద్ద పొడవాటి క్యూలు, అధికారుల నిర్వహణా వైఫల్యంతో రైతు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

ప్రేంసింగ్‌కు ఈ నెల 19న తను పండించిన గోధుమలను తీసకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జలరా కొనుగోలు కేంద్రానికి రావాలంటూ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. దీంతో అక్కడకు చేరుకుని నాలుగు రోజుల పాటు వేచిచూసిన తర్వాత తనోడియా కొనుగోలు కేంద్రానికి వెళ్లాలని అధికారులు సూచించడంతో మే 24 వరకూ అక్కడ పడిగాపులు కాశాడు. 25న ఎట్టకేలకు అతడి పంటను తూకం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యే లోగానే తనకు అసౌకర్యంగా ఉందని అంటూ ప్రేంసింగ్‌ కుప్పకూలాడు. అధికారులు స్ధానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.

ప్రేంసింగ్‌ తొలి ట్రాలీని తూకం వేశామని, రెండో ట్రాలీ తూకంపై ఉండగానే ఆయన కుప్పకూలి స్పృహ కోల్పోయారని తనోడియా కొనుగోలు కేంద్రం మేనేజర్‌ సంజయ్‌ కార్పెంటర్‌ పేర్కొన్నారు. గుండె పోటుతో ప్రేంసింగ్‌ మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని, ప్రభుత్వ పథకం కింద ఆయన కుటుంబానికి రూ 4 లక్షల పరిహారం అందించామని జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. కాగా, పంటలను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గోధుమల సేకరణపై శివరాజ్‌ చౌహాన్‌ ప్రభుత్వం చెబుతున్నవన్నీ అవాస్తవాలని మాజీ సీఎం కమల్‌ నాథ్‌ ఆరోపించారు.

చదవండి : ‘రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాం’