'దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి'
కరాచీ: పాకిస్తాన్‌లో జరిగిన విమాన ఘోర ప్రమాదంలో 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలోంచి బాధిత కుటుంబాలు ఇంకా ఇంకా తేరుకోలేకపోతుండగా.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం(పీఐఏ) మాత్రం వారిని ప్రశ్నలతో వేధిస్తూ మరింత చిత్రవధ చేస్తోంది. "మీకు మృతదేహాలు అందాయా?" అంటూ పదేపదే ఫోన్ చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తోంది. పీఐఏ తీరుపై మండిపడ్డ అదిల్ రెహ్మాన్ అనే వ్యక్తి ట్విటర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. (‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’)
"ఈ భయంకర ప్రమాదంలో నా తల్లిదండ్రులను కోల్పోయాను. వారి మరణాన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే పీఐఏ చేతిలో మేము అనుభవిస్తున్న నరకం క్షమార్హం కానిది. అధికారులు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడుగుతూ మమ్మల్ని మరింత బాధకు గురి చేస్తున్నారు. తెల్లవారు జామున 2.30కి కూడా కాల్ చేసి అదే ప్రశ్న సంధిస్తున్నార"ని వాపోయాడు. కాగా రెహ్మాన్ యూఎస్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానం ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలగా, ఈ ప్రమాదంలో అతడి తల్లిదండ్రులు ఫజల్, వలీదా రెహ్మాన్ మరణించారు. వారి మృతదేహాలు ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో పీఐఏ అధికారులు మృతదేహాలు అందాయో లేదో తెలుసుకునేందుకు పదేపదే ఫోన్‌లో సంప్రదించడంతో అతడు విసిగిపోయాడు. అదే సమయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. (ఇద్దరు తప్ప అందరూ..)
ఈ విషయం గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ.. "కాస్త మా బాధల్ని అర్థం చేసుకోండి. ఇప్పటికే లాహోర్, కరాచీ ఫోరెన్సిక్ బృందాల మధ్య గొడవ వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతోంది. ఈ సమయంలో కొన్ని మృతదేహాలు కూడా దొంగతనానికి గురవుతున్నాయి. అసలు మీకు ఆత్మ అనేదే లేదా?, కనీసం అల్లా అంటే కూడా భయం లేదా? దయచేసి చనిపోయిన మా పేరెంట్స్‌పై దయ చూపండి" అని రెహ్మాన్ ట్విటర్‌లో వేడుకున్నాడు. ఇప్పటివరకు 41 మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబానికి అందజేసినట్లు పాకిస్తాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 19 మృతదేహాలను కరాచీ ఆసుపత్రిలో నుంచి వారి బంధువులు బలవంతంగా తీసుకెళ్లడంతో మిగతా మృతుల గుర్తింపు ఆలస్యం అయింది. (కుప్పకూలిన పాక్ విమానం)