https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/didijii.jpg?itok=7ryp7XQ8

రైల్వేల తీరుపై దీదీ ఫైర్‌



కోల్‌కతా : రైల్వే మంత్రిత్వ శాఖ వలస కూలీల కోసం ముందస్తు సమాచారం లేకుండా రైళ్లను పంపుతూ తమ ప్రభుత్వం చేపట్టే కరోనా కట్టడి చర్యలకు విఘాతం కలిగిస్తోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దుయ్యబట్టారు. కరోనా వైరస్‌ను మహారాష్ట్ర నుంచి బెంగాల్‌కు వ్యాప్తి చేస్తూ ఇరు రాష్ట్రాలతో రైల్వేలు రాజకీయంగా చెలగాటమాడుతున్నాయని దీదీ ఆరోపించారు. ఈ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని ఆమె అభ్యర్ధించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఇలా ఎందుకు చేస్తోందో తనకు అర్ధం కావడం లేదని మమతా బెనర్జీ మండిపడ్డారు.

శ్రామిక్‌ రైళ్ల చార్జీలు రాష్ట్రాలు భరిస్తున్నా రైల్వేలు భౌతిక దూరం సహా కోవిడ్‌-19 నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. తాను తుపాన్‌, కరోనా వైరస్‌లతో పోరాడాలో, రాజకీయాలతో పోరాడాలో చెప్పాలని కోరారు. దేశవ్యాప్తంగా 225 రైళ్లు బెంగాల్‌కు చేరుకోవాల్సి ఉండగా వీటిలో 41 రైళ్లు కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర నుంచి రానున్నాయి. ఇప్పటికి కేవలం 19 రైళ్లే వచ్చినా వలస కూలీలు అధికంగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్‌, నార్త్‌ దినాజ్‌పూర్‌ ప్రాంతాల్లో కూలీలు స్వస్ధలాలకు చేరడంతో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడం​ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని రైళ్లు బెంగాల్‌కు చేరుకుంటే రాష్ట్రం కరోనా హాట్‌స్పాట్‌గా మారుతుందని బెంగాల్‌ ప్రభుత‍్వం భయపడుతోంది.

చదవండి : ఇంత బీభత్సమా.. షాకయ్యాను