కరోనా: వైద్యుడి ప్రజాచైతన్య యాత్ర
కరోనా సంకట పరిస్థితిలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆలోచించకుండా, ఒక వ్యక్తిగా తాను ఏం చేయగలను అని ఆలోచించారు డాక్టర్ పరికిపండ్ల అశోక్. లాక్‌డౌన్ పీరియడ్‌లో అందరూ ఇండ్లల్లో జాగ్రత్తగా ఉన్నా కానీ తప్పనిసరిగా నాలుగు వర్గాలు పని చేయాల్సి ఉంటుంది. వాటిలో పారిశుద్ధ్య కార్మికులు, వృత్తిరీత్యా తప్పనిసరిగా 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులు, పత్రికావిలేకరులు, రెవెన్యూ సిబ్బంది, ఆశవర్కర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది... వీరిని కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా భావించిన డాక్టర్ అశోక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి 30 వేల కరపత్రాలతో,ప్లేకార్డ్స్‌తో లక్షమందికి సరిపడా కరోనా వ్యాధిపై వ్యాధినిరోధకశక్తిని పెంపొందించే ఆర్సినికం ఆల్బం అనే హోమియోపతి మందును లక్షమందికి సరిపడే విధంగా తయారు చేసుకుని బైక్‌పై బయలు దేరారు.
మహబూబాబాద్‌లో మొదలు
ఏప్రిల్ 22న మహబూబాబాద్ జిల్లాకేంద్రం లో అక్కడి అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, ఆర్డీవో కొమురయ్య జెండా ఊపి ప్రారంభించిన ఈ యాత్ర జిల్లాలోని 16 మండలాల్లో ప్రతిరోజు ఒక మండలం, ప్రతిమండలంలో కనీసం పదిగ్రామాలను కలుపుతూ అక్కడి పారిశుద్ధ్య కార్మికులు, సాధారణ ప్రజలను చైతన్యం చేస్తూ ఉచిత హోమియోపతి మందులను పంపిణీ చేస్తూ 50 మండలాలు 198 గ్రామాలు... 1525 కిలోమీటర్లు సాగింది.
ప్రస్తుతానికి నాలుగు జిల్లాలను పూర్తి చేసిన ఈ యాత్ర కొనసాగింపుగా ములుగు, భూపాలపల్లి జిల్లాలతో కలిపి పెద్దపల్లి గుండా కరీంనగర్ వరకు చేరుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు, మొత్తంగా మూడువేల కిలోమీటర్లు ప్రయాణం, లక్షమందికి మందులను పంపిణీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు డాక్టర్ అశోక్ తెలిపారు.
కరోనా లాంటి సంకట పరిస్థితిలో ప్రభుత్వం ఒకే వైద్యవిధానంపై ఆధారపడకుండా సమీకృత, సరళమైన అన్నిరకాల వైద్యాలను ప్రోత్సహించి తక్కువ ఖర్చుతో వైద్యం అందేటట్లు ఆలోచించాలని కోరారు.
– గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్ రూరల్