కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్?!
ఖాట్మండూ: గత కొన్ని రోజులుగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త మ్యాపుల రూపకల్పనను తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. భారత్- నేపాల్ సరిహద్దులో గల లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి..... కొత్త మ్యాపు ప్రచురణకు వీలుగా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్)
ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ.. సెంట్రల్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడిన తర్వాతే ఈ విషయంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కుండబద్దలు కొట్టింది. దీంతో ప్రధాని ఓలికి చట్టసభలో నిరాశే ఎదురైంది. అయితే ప్రతిపక్షం తమ నిర్ణయంతో విభేదించిందే తప్ప.. బిల్లు రద్దు కాలేదని.. మరో పదిరోజుల్లో ఇదే బిల్లును తిరిగి సభలో ప్రవేశపెడతామని ఓలి ప్రగల్భాలు పలికారు. కాగా గడిచిన రెండు నెలలుగా ఓలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇది రెండోసారి. ఇక లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ విషయంలో భారత్‌కు కౌంటర్ ఇవ్వాల్సిందిగా.. నేపాల్ ఆర్మీ చీఫ్ పూర్ణచంద్ర థాపాకు ఓలి సూచించగా.. ఇది పూర్తిగా రాజకీయ పరమైన అంశం కాబట్టి.. అందులో తాను తల దూర్చలేనని ఆయన స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. (భారత్‌పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు)
కాగా లిపులేఖ్‌లో భారత్ చేపట్టిన రహదారి నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్.. ఈ విషయమై భారత రాయబారికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక సరిహద్దుల్లోని ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాపులు రూపొందించింది. ఈ క్రమంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన నేపాల్ ప్రధాని ఓలి... తమ దేశ ప్రజల సెంటిమెంట్లకు భారత్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. అంతేగాక ప్రాణాంతక కరోనా వైరస్ భారత్ వల్లే తమ దేశంలో ప్రవేశించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే ఓలి ఈ విధంగా భారత్‌కు వ్యతిరేకంగా నేపాలీలను సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని.. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని భారత్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.(చిచ్చురేపుతున్న నేపాల్!)