బతికున్న మనిషిని నిలువునా చంపేశారు
రాంచీ : కరెంట్ షాక్‌కు గురైన వ్యక్తిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకురాగా అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. లోహర్‌దాగా జిల్లాకు చెందిన వ్యక్తి మంగళవారం కరెంట్ షాక్‌కు గురవ్వడంతో రాంచీలోని చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. పోస్టుమార్టం కొరకు రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు సిఫార్సు చేశారు. కాగా రిమ్స్ అధికారులు వ్యక్తి శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అయితే ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్న సమయంలో చనిపోవడం గమనార్హం. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా సీరియస్ అయ్యారు. బతికున్న మనిషిని చచ్చిపోయాడంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చిన చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు.