https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/uttam-kumar-reddy.jpg?itok=aa7dzRYJ

జూన్‌ 2న కాంగ్రెస్‌ శ్రేణుల దీక్ష‌

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ప్రాజెక్టులు కట్టేది నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికే అని తెలంగాణ పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ చేపట్టాలన్నారు. జూన్‌ రెండవ తేదీన ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలి అని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. కాళేశ్వరం నుంచి రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ లక్ష కోట్లు ఖర్చుచేశారన్నారు. తరతరాలను ఇందుకోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. (కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు!)

లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.  ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌కు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లేవని కానీ ఆరేళ్లలో టన్నెల్‌ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు. కరోనాపై అంతర్జాతీయ నిపుణులు కేసీఆరే, ఇరిగేషన్‌పై అంతర్జాతీయ నిపుణులు కేసీఆర్‌, వ్యవసాయంపై కూడా అంతర్జాతీయ నిపుణులు కేసీఆరే అని చెప్పుకుంటున్నారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. ఎవరైనా మాట్లాడేందుకు వెళితే ప్రతిపక్షాలను, మీడియాను తన అహంకారపు వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్‌ విమర్శిస్తున్నారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. ఆరేళ్ల తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు వందశాతం పూర్తి కాలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితం ఇస్తే అక్కడ డబ్బులు ఖర్చు పెడితే కమిషన్‌ తక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా అని నిలదీశారు. జూన్‌ 2న మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులు ప్రాజెక్టుల వద్ద ఒక రోజు దీక్ష చేపట్టాలి అని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. 

( తర్వాతే షూటింగ్లకు అనుమతి: తలసాని)