https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/Trump_Warning.jpg?itok=bs2FS_YH

వారంలోగా చైనాపై కఠిన చర్యలు: ట్రంప్‌

వాషింగ్టన్‌: హాంకాంగ్‌ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న చైనాపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. మంగళవారం నాటి సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘మేం ఇప్పుడు ఏం చేస్తున్నామో వారంలోగా మీకు తెలుస్తుంది. అది మీకు అత్యంత ఆసక్తికలిగించేదిగా ఉంటుంది. అంతేగాక అది శక్తివంతమైన నిర్ణయం అయి ఉంటుంది’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాగా స్వయంప్రతిపత్తి హోదాను కలిగి ఉన్న హాంకాంగ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు డ్రాగన్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.(చైనా కీలక నిర్ణయం.. హాంకాంగ్‌కు ముగింపు ఇది!)

ఇందులో భాగంగా వాణిజ్య, ఆర్థిక హబ్‌ అయిన హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా ఓ ముసాయిదా బిల్లును ఇటీవలే చైనా పార్లమెంటులో ప్రవేశపెట్టి.. ఆమోదం తెలిపింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. చైనీస్‌ కంపెనీలను తమ స్టాక్‌ ఎక్ఛ్సేంజీల నుంచి డీలిస్టింగ్‌ చేసేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్న హాంకాంగ్‌ను గుప్పిట్లోకి తెచ్చుకుని.. తమ కంపెనీలను బ్రిటన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ చేసి.. తద్వారా అమెరికాకు కౌంటర్‌ ఇవ్వాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌పై చైనా పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదంటూ ట్రంప్‌ ఇదివరకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. (చైనాకు అమెరికా భారీ షాక్‌..)