1100 కి.మీ. ప్రయాణించిన మొసలి
కోల్‌కతా: లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు వందలాది కిలోమీటర్లు నడుస్తూ సొంతగూటికి చేరుకుంటున్నారు. అయితే ఓ మొసలి కూడా ఏకంగా రాష్ట్రాలనే దాటుతూ పయనించింది, కానీ స్వదేశం నుంచి వలస వస్తూ మన దేశంలో అడుగుపెట్టింది. దీని విశేషమేంటో ఓసారి చూసేద్దాం.. ఈ మొసలి ఘరియల్ జాతికి చెందినది. ఈ జాతి మొసళ్లు ఇప్పటికే అంతరించిపోతున్న జీవాల జాబితాలో ఉన్నాయి. ఇవి కేవలం చేపలను మాత్రమే ఆహారంగా భుజిస్తాయి. అందుకనుగుణంగా వీటి నోటి భాగం కూడా పొడవుగా ఉంటుంది. ఈ ఘరియల్ మొసలిని నేపాల్ దేశం అడవిలో విడిచిపెట్టింది. (వామ్మో.. మొసలి)
అది అక్కడనుంచి నదుల్లో పాక్కుంటూ 1100 కి.మీ. ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదికి చేరుకుంది. ఇక్కడికి చేరుకోడానికి ఘరియల్‌కు 61 రోజుల సమయం పట్టింది. దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా దీన్ని నేపాల్‌కు చెందినదిగా భారత శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీని గురించి తెలియజేస్తూ 'వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా' ఘరియల్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీని యాత్ర కథ తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. "ఈ ప్రయాణానికి పుల్‌స్టాప్ పడిందా? లేదా యాత్ర కొనసాగుతుందా?" అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలోనూ ఓ ఘరియల్ 234 రోజుల్లో వెయ్యి కి.మీ చుట్టేసి ఔరా అనిపించింది. (లాక్‌డౌన్ తొలగిస్తే ఇలాగే పరిగెడతారేమో!)