https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/china_0.jpg?itok=xKBnRxs5

చైనా దూకుడు: మళ్లీ అదే టీం రంగంలోకి?!



న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం విదితమే. డ్రాగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సహా... రక్షణ దళాల మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల్ని యథాతథంగా కొనసాగించేందుకు అవలంబించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో దౌలత్‌ బేగ్‌ ఒల్డీ(డీబీఓ) సెక్టార్‌ వెంబడి చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసి తీరతామని అధికార వర్గాలు వెల్లడించాయి. (చైనా కవ్వింపు చర్యలపై ఆర్మీ కమాండర్ల భేటీ)

‘‘ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్‌ దాకా.. హాంకాంగ్‌ నుంచి తైవాన్‌, తైవాన్‌ నుంచి దక్షిణ చైనా సముద్రం.. అక్కడి నుంచి అమెరికా దాకా.. ఇలా ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఏదేమైనా డర్బుక్‌-ష్యోక్‌-డీబీఓ వద్ద చేపట్టిన రోడ్డు నిర్మాణం ఈ ఏడాదికల్లా పూర్తవుతుంది. తద్వారా సరిహద్దుల వద్ద భారత్‌ మరింత ఎక్కువ బలగాలను మోహరించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఆ రోడ్డును బ్లాక్‌ చేస్తే భారత ఆర్మీ సన్సోమా నుంచి ముర్గో- డీబీఓ మీదుగా హిమనీనదాల వెంబడి బయటకు రావాల్సి ఉంటుంది. అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి రహదారి పూర్తి చేయాల్సి ఉంది’’ అని ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు. (హద్దు మీరుతున్న డ్రాగన్‌)

ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన వివాదాన్ని పరస్పర గౌరవమర్యాదలతో కూడిన శాంతియుత చర్చల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డోక్లాం వివాద సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించి ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకువచ్చిన తన టీంను ప్రధాని మోదీ మరోసారి రంగంలోకి దించే అంశంపై మంగళవారం నాటి సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌ను తాజా పరిస్థితులపై చైనాతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా డోక్లాం వద్ద ప్రతిష్టంభన తలెత్తిన సమయంలో ఆర్మీ చీఫ్‌గా ఉన్న బిపిన్‌ రావత్‌, విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ కీలక బాధ్యతల్లో ఉన్న విషయం తెలిసిందే. 

డ్రాగన్‌ ఉద్దేశపూర్వకంగానే..
ఇక ప్రపంచమంతా మహమ్మారి కరోనా పుట్టుకకు చైనానే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్న వేళ భారత సరిహద్దుల్లో డ్రాగన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం. కోవిడ్‌పై పోరులో భారత్‌ తలమునకలై ఉండటం, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌- బాల్టిస్తాన్‌ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్తాన్‌ సిద్ధమవుతున్న తరుణంలో.. చైనా ఉద్దేశపూర్వంగానే  2017 నాటి డోక్లామ్‌ తరహా వివాదాన్నితెరమీదకు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. లదాఖ్‌ సరిహద్దుల్లో వైమానిక స్థావరం విస్తరించడంతో పాటుగా.. పాంగాంగ్‌ సరస్సు ప్రాంతానికి 200 కి.మీ. దూరంలో ఎయిర్‌ బేస్‌ను నిర్మించేందుకు సన్నద్ధం కావడం చైనా ప్లాన్‌లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.