సంజయ్ మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా అవే!
సాక్షి, వరంగల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసుతో కదిలివచ్చిన పోలీస్ వాహనాలు, పలు విభాగాల అధికారుల హడావిడితో అట్టుడికిన గొర్రెకుంట ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని బార్దాన్ గోదాంలో పని చేసే వలస కూలీలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది బావిలో శవాలై తేలిన కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును త్వరగా ఛేదించడానికి ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సై స్థాయి నుంచి ఐపీఎస్‌ల వరకు పోలీస్ అధికారులు, హైదరాబాద్ నుంచి సిటీ క్లూస్ టీం, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీ కోర్, సీసీఎస్, ఎస్‌బీ, ఇంటలిజెన్స్ విభాగం... ఇలా పోలీస్ శాఖలోని దాదాపు అన్ని ముఖ్య విభాగాలు పని చేశాయి. బావిలో మృత దేహాలు తేలిన ఈనెల 21 నుంచి 24 వరకు గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతం పోలీస్ వాహనాల రాకపోకలతో బిజీగా మారింది. తొమ్మిది మందిని ఎవరు హత్య చేసి ఉంటారా అనే అంశంపై ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూశారు. 6 ప్రత్యేక బృందాలు కేవలం 72 గంటల్లోనే హంతకుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ( మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం)
ఓకే గూగుల్‌ను ఫుల్‌గా వాడేశాడు..
ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10 మందిని చంపిన అతడిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. సంజయ్ 3వ తరగతి వరకు చదువుకున్నా గతంలో ఢిల్లీలోని ఓ సెల్‌ఫోన్ షాపులో పని చేసిన అనుభవంతో ఇంటర్ నెట్ ఉపయోగించడంలో దిట్ట. తనకున్న పరిజ్ఞానాన్ని నేరాలు చేయడం, తర్వాత తప్పించుకోవడం ఎలా అన్న విషయాలకే ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ టూల్‌లోని 'ఓకే.. గూగుల్' ఆప్షన్ ద్వారానే నేరాలకు అవసరమైన సమాచారాన్ని పొందాడు. ఓకే గూగుల్.. అంటూ ఎక్కువ కాలం మత్తునిచ్చే టాబ్లెట్ల పేరు ఏవని తెలుసుకుని తన ప్రణాళికను విజయవంతంగా అమలు చేశాడు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అతడి సెల్‌ఫోన్‌తో పాటు మృతుల సెల్‌ఫోన్‌ల కాల్ డేటా ఆధారంగా హంతకుడిని త్వరగా గుర్తించారు. అంతే కాకుండా హంతకుడు తన సెల్‌ఫోన్ ద్వారా యూట్యూబ్, గూగుల్ సెర్చ్ ద్వారా ఏఏ విషయాలను పరిశీలించాడనేవి పోలీసులకు క్లూస్‌గా మారాయి.
( ఖైదీ నంబర్ 4414 )
నిందితుడి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు
అతడు వరంగల్‌లోని ఒక మెడికల్ షాపులో ఎక్కువ ధర చెల్లించి కొన్ని మాత్రలు కొనుగోలు చేసినట్టు సమాచారం. మత్తు కోసం చాలా మంది వ్యసనపరులు ఇలాంటి మందులను దొంగచాటుగా కొనుగోలు చేస్తుంటారు. సంజయ్ ఇదే కోవకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక సంజయ్ సెల్ ఫోన్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, అశ్లీల చిత్రాలు, వీడియోలతోనే నిండి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మహిళలతో బెడ్ రూమ్‌లో ఉన్న ఫోటోలు, నెట్‌లో డౌన్‌లోడ్ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. మనిషిని హత్య చేయడం సంజయ్‌కి టీ తాగినంత తేలిక. అతడిలో అపరాధ భావం మచ్చుకైనా కానరావడం లేదని తెలుస్తోంది. విచారణలో పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టినట్టు సమాచారం. ఆపస్మారక స్థితిలో ఉన్న తల్లి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల వద్ద గుక్కపట్టి ఏడుస్తున్న మూడేళ్ల బాలుడి కన్నీళ్లు కూడా సంజయ్‌ను కదిలించలేకపోయాయి. ఆ చిన్నోడి ఏడుపు తన నేరానికి అడ్డు అవుతుందని భావించి కొట్టి, గొంతు పిసికి, ప్రాణం ఉండగానే బావిలో పడేశానని పోలీసుల విచారణలో సంజయ్ ఒప్పుకున్నాడు. ( పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?)
సంజయ్ సైకిల్
కీలకంగా మారిన సీసీ కెమెరాలు
మృతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావడం, హంతకుడు ఎవరో తెలియకపోవడంతో తొలుత పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. అయితే గొర్రెకుంట ప్రాంతంతోపాటు వరంగల్ వెంకట్రామా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజీల్లో సంజయ్ వరుసగా ఐదు రోజులుగా సైకిల్‌పై వచ్చి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తొమ్మిది మందిని హత్య చేసిన తీరుతో పాటు వీటన్నింటికి కారణమైన రఫికా హత్య వివరాలు తెలుసుకోవడం పోలీసులకు సులువైంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఎంతటి క్లిష్టమైన కేసునైనా సులభంగా చేధించవచ్చునని మరోసారి నిరూపితమైందని పోలీసులు చెబుతున్నారు.