ఇలా అయితే ప్రభుత్వం చేయడానికి ఏముంటుంది?- అడిషనల్ అడ్వకేట్ జనరల్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూములు విక్రయించే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. భూములు అమ్మకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అయితే భూముల అమ్మకాలు కోర్టు తుది ఉత్తర్వులకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
వాదనల సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మంచి సారవంతమైన భూములున్నాయి.. మంచి పంటలు పండుతాయి.. ఇక్కడ ప్రజలు సంపన్నులు.. అయినప్పటికీ పేద రాష్ట్రంగానే ఎందుకుంది?’ అని వ్యాఖ్యానించింది.
దీనికి సుధాకర్‌రెడ్డి బదులిస్తూ.. రాష్ట్ర విభజన తరువాతే ఏపీ ఆర్థికంగా బాగా నష్టపోయిందని, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన నిర్ణయాన్ని ఇలా రాజకీయ కారణాలతో హైకోర్టులో సవాల్ చేస్తూ పోతే ఇక ప్రభుత్వం చేసేది కూడా ఏముంటుందని సుధాకర్ రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన ధర్మాసనం తమకు రాజకీయాల జోలికి వెళ్లే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించింది.
ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైనా వ్యాజ్యాలు వేయడం ఎక్కువైపోయిందని… చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కూడా అడ్డుకునేందుకు కొందరు కోర్టులకు వస్తున్నారని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఈ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని… ఇది ఒక విధంగా న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనుల కోసం భూములు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని … దీనిపై ఎక్కడా నిషేధం లేదని సుధాకర్ రెడ్డి వాదించారు.
డబ్బుల కోసం ఇలా ప్రభుత్వ భూములను అమ్మడం సరైనదేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. తాము గత ప్రభుత్వం తరహాలో సొంత జేబులు నింపుకోవడానికి భూములు అమ్మడంలేదని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణ కోసమే భూములు అమ్ముతున్నామని సుధాకర్‌రెడ్డి చెప్పారు.