హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపుతూ..
పట్నా: వలస కార్మికుల వెతలు అన్నీ ఇన్నీకావు. బతువు దెరువు కోసం పట్నం వచ్చినవారిని కరోనా కన్నా ముందు ఆకలి కాటేస్తోంది. రోజుల తరబడి ఆకలి దప్పికలను ఓర్చుకోలేని ఓ వలస కార్మికురాలు ప్రాణాలు విడిచింది. ఆమె శాశ్వతంగా నిద్రపోయిందని తెలియని ఆమె కుమారుడు అమ్మను లేపడానికి ప్రయత్నించాడు. గుండెల్ని పిండేస్తోన్న ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బీహార్‌కు చెందిన వలస కార్మికురాలు ఉపాధి కోసం వెళ్లిన గుజరాత్ నుంచి శనివారం శ్రామిక్ రైలులో స్వస్థలానికి తిరుగు పయనమైంది. అయితే ఆ రైలు తన గమ్యం చేరుకోకముందే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని ముజఫర్‌నగర్ స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచారు. (సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ)
అయితే ఆమె కుమారుడికి తల్లి మరణవార్త తెలీక ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒంటిపై కప్పిన దుప్పటినీ లాగుతూ తల్లిని లేవమని చెప్పకనే వేడుకున్నాడు. ఈ హృదయ విదారక దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియయాలో చక్కర్లు కొడుతోంది. తిండీ, నీళ్లు లేకే రైలులో అనారోగ్యానికి గురైందని ఆమె బంధువులు పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి ఎన్నో దృశ్యాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. గూడు చేరేందుకు బహదూరపు బాటసారులుగా మారిన వలస కార్మికులను రోడ్డు ప్రమాదాలు, ఆకలి కేకలు బలి తీసుకుంటున్నాయి. (నీరింకిన కళ్లు..!)