లాక్‌డౌన్ ఉల్లంఘన.. చావు తెలివితేటలు
లిమా: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాక అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా చనిపోయినట్లు నటించాడు పెరూ పట్టణానికి చెందిన మేయర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. కరోనా నేపథ్యంలో పెరూలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. కానీ టంటారా పట్టణ మేయర్ జైమే రొలాండో అర్బినా టొర్రెస్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చి పార్టీ చేసుకున్నారు. అయితే పోలీసులు రాగానే జైమే రొలాండో ఫేస్‌మాస్కు ధరించి, కళ్లు మూసి అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న శవపేటికలో పడుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మేయర్ జైమే రొలాండో ఇలా చేశారు. జైమే రోలాండ్ చనిపోయిన వ్యక్తిగా నటిస్తున్నపుడు తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే జైమే రొలాండో స్నేహితులను అప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పెరూలో లాక్‌డౌన్‌ను జూన్ చివరి వరకు పొడిగించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.3 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3700 మంది కరోనాతో చనిపోయారు. పెరూ కఠినంగా లాక్‌డౌన్ రూల్స్ అమలు చేస్తుంటే టంటారా మేయర్ జైమే రొలాండో ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..