https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/house%20arrase.jpg?itok=NgV5SK6a

అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో



సాక్షి, బెంగళూరు :  కరోనా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన అనంతరం కర్ణాటకలో మహిళలపై దౌర్జన్యం కేసులు హెచ్చుమీరుతున్నాయి. భర్త, కుటుంబ సభ్యులు దాడులకు వెనుకాడడం లేదు. అలాంటిదే ఈ ఉదంతం. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఒక హైకోర్టు లాయర్‌ సైకోగా మారాడు. తన భార్య అందంగా కనిపించకూడదని, ఆమె జుట్టు కత్తిరించి చిత్రహింసలకు పాల్పడ్డాడు. అయితే ఇందుకు అంగీకరించని కట్టుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. బాధితురాలు వనితా సహాయవాణిని ఆశ్రయించడంతో పైశాచిక భర్త బాగోతం బయటపడింది. 

వీరికి 8 ఏళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రారంభంలో ఎంతో  అన్యోన్యంగా ఉన్నారు. తరువాత అనుమానం పెంచుకుని భార్యను పీడించసాగాడు. ఆర్థికంగా వెనుకబడిన  బాధితురాలి తల్లిదండ్రులు భర్తతో సర్దుకుపోవాలని కుమార్తెకు బుద్ధిమాటలు చెప్పారు. భార్య అందంగా ఉండరాదని ఆమెకు బలవంతంగా జుట్టు కత్తిరించాడు ఆ లాయరు భర్త. నువ్వు  ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు నిన్ను ఎవరూ చూడకూడదు. నేను చెప్పినట్లు వినకపోతే  సహించేది లేదంటూ రోజూ కొట్టేవాడు.  బాధితురాలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా, భర్తను పిలిచి  రాజీ కుదిర్చి పంపారు. జనవరిలో మళ్లీ ఆమె జుట్టును కత్తిరించడానికి భర్త యత్నించాడు. అయితే పిల్లల కోసం హింసను భరించింది.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/women-sad.jpg1.jpg

 
గుండు చేయించుకోవాలని హింస  
చివరకు గుండు గీయించుకోవాలని ఆమెను బెదిరించాడు. ససేమిరా అనడంతో కొట్టి ఇంట్లోనుంచి బయటికి గెంటివేశాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఆమె పరిచయస్తుల సలహా మేరకు మహిళా సహాయవాణిని సందర్శించి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి నుంచి సహాయవాణి సిబ్బంది  ఆమెను విద్యారణ్యపుర స్వధార్‌ గృహానికి తరలించారు.  విచారణకు హాజరు కావాలని భర్తకు నోటీసులు పంపారు. ఆ లాయర్‌ తన తండ్రిని విచారణకు పంపించి తప్పించుకోవడానికి యత్నించాడు. తన పలుకుబడితో నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో భార్య పైనే ఫిర్యాదు చేశాడు. 

పెరుగుతున్న ఫోన్‌కాల్స్‌  
రాష్ట్రంలో 193 సాంత్వన కేంద్రాలు రోజుకు 24 గంటలూ పనిచేస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాధితులకు ఫోన్‌ ద్వారా సాంత్వన పలుకుతున్నారు. రెండునెలల్లో హెల్ప్‌లైన్‌ కు 1,294 కు పైగా ఫోన్‌ కాల్స్‌ రాగా అందులో 200కు పైగా ఫోన్‌కాల్స్‌ భర్త, కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు సంబంధించినవి. బాధిత బాలికలు, మహిళలకు సిబ్బంది ఏం చేయాలో చెప్పి ప్రమాదం రాకుండా చూస్తున్నారు. తాత్కాలికంగా స్వధార్‌ గృహాల్లో బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.