https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/nlr.jpg?itok=YOvkFlep
విలేకరులతో మాట్లాడుతున్న శ్రావణ్‌కుమార్‌

పగటిపూట ఆరోపణలు.. రాత్రుళ్లు రాజీలు



నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పగటిపూట ఆరోపణలు చేస్తూ.. రాత్రుళ్లు రాజీలు చేసుకోవడం టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నైజమని, అలాంటి వ్యక్తి వైఎస్సార్‌సీపీపై బురదజల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. నెల్లూరులోని రాజన్నభవన్‌లో మంగళవారం విద్యార్థి విభాగం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేస్తే దానిని కోటంరెడ్డి ఓ కథగా అల్లి వైఎస్సార్‌సీపీకి ఆపాదించడం దారుణమన్నారు. బురదజల్లితే అబద్దాలు వాస్తవాలు అయిపోవన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త సెల్‌ఫోన్‌ షాపులో ఉండగా గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, దానిపై కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నానా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

ఉదయం తమ పార్టీపై ఆరోపణలు చేసి రాత్రిపూట తమపార్టీ నేతలతో రాజీలు చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన కాల్‌డేటాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు పంపుతామని, అందుకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తన కుటుంబసభ్యులపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని బాలాజీనగర్‌ పోలీసులను ప్రశ్నించగా, ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌ వెంటనే బాలాజీనగర్‌ పోలీసులకు ఫోన్‌ చేసి పోస్టులు పెట్టిన వారు ఎవరైనా సరే అరెస్ట్‌ చేయాలని ఆదేశించారని గుర్తుచేశారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇప్పటికైనా చౌకబారు విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్‌ హాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బి.సత్యకృష్ణ, కాకు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.