https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/ICC.jpg?itok=9HTNkU3v

టీ20 ప్రపంచకప్‌ వాయిదా? రేపు క్లారిటీ!



దుబాయ్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలో ఈ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) గురువారం అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. దీంతో ఈ సమావేశం తర్వాతనే టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

అయితే ఇప్పటివరకు ఐసీసీ వర్గాలు అందించిన అనధికారిక సమాచారం ప్రకారం అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచకప్‌ నిర్వహణకు ఆసీస్‌ కరోనా నిబంధనలు ప్రతిబంధకంగా మారినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ పర్యాటక వీసాలను ఆస్ట్రేలియా రద్దు చేయడం, సెప్టెంబర్‌ వరకు ఆసీస్‌లో లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో టోర్నీ ఏర్పాట్లు సాధ్యమయ్యేలా కనిపించకపోవడం, ఆటగాళ్ల క్వారంటైన్‌ వంటి తదితర కారణాలతోనే ఈ మెగా టోర్నీ వాయిదా పడే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచశ్రేణి, మాజీ ఆటగాళ్లు సైతం ప్రస్తుత తరుణంలో ప్రపంచకప్‌ కంటే ఐపీఎల్‌ టోర్నీనే ఉత్తమమని సూచిస్తుండటంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన గురువారం వెలువడే అవకాశం ఉంది. 

చదవండి:
'భజ్జీ ! మెల్లిగా.. బిల్డింగ్‌ షేక్‌ అవుతుంది'
'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు'