https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/ong.jpg?itok=1gc7o6zB
సాగర్‌ కాలువ వద్ద గుమిగూడిన బంధువులు, స్థానికులు

సాగర్‌ కాలువలో బాలుడి గల్లంతు

ప్రకాశం, త్రిపురాంతకం: సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన బాలుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన సాగర్‌ కాలువలో మంగళవారం జరిగింది. బాలుడి ఆచూకీ కోసం  సాగర్‌ కాలువలో గాలిస్తున్నారు. వివరాలు.. యర్రగొండపాలేనికి చెందిన దూదేకుల కాశిం (16) పదో తరగతి చదువుతున్నాడు. సరదాగా తోటి స్నేహితులతో కలిసి త్రిపురాంతకం సాగర్‌ కాలువకు ఈత కొట్టేందుకు వచ్చాడు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా మునిగి పోవడం చూసి మిగిలిన ముగ్గురు స్నేహితులు రక్షించే ప్రయత్నం చేశారు.

ప్రధాన కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రక్షించే ప్రయత్నం చేసిన వారిలో మరొకరు మునిగిపోబోయారు.  పిల్లల కేకలు విని అటుగా వచ్చిన ట్రాక్టర్‌లోని కొందరు తాడు వేసి మునిగిపోబోతున్న బాలుడిని రక్షించారు. కాశిం అప్పటికే  నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు, స్థానికులు, బంధువులు అక్కడకు చేరుకుని సత్వర చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఈతగాళ్లను పిలిపించి బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. కాశిం ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి హుస్సేన్‌ యర్రగొండపాలెంలో ముఠామేస్త్రిగా పనిచేస్తున్నాడు. రంజాన్‌ పండగకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాశిం ఇంతలోనే ప్రమాదంలో చిక్కుకున్నాడు.