https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/hdfc%20amc.jpg?itok=_XENbsJV

లాంగ్‌టర్మ్‌కు మంచి ఛాన్స్‌!



ఈ ఏడాది ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనునకునేవాళ్లు పీఈ మల్టిపుల్స్‌ను చూసి కాకుండా రంగాలవారీగా లాభదాయకత అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ ప్రశాంత్‌ జైన్‌ చెప్పారు. డిమాండ్‌ పడిపోవడం, తద్వారా షేర్లు పతనం కావడంతో వాల్యూషన్లు బాగా దిగివచ్చి ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో మార్కెట్‌క్యాప్‌- జీడీపీ నిష్పత్తి 60 శాతానికి చేరిందని, ఇలాంటి స్థాయిలు గతంలో వచ్చినప్పుడు మంచి పెట్టుబడి అవకాశంగా నిలిచాయని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశీయ సూచీలు తమ ఆల్‌టైమ్‌ హై నుంచి దాదాపు 25 శాతం దిగువకు వచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఎకానమీలో, ఈక్విటీల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోందని, అయితే ఓపికతో ఎదురు చూడగలిగేవాళ్లకు ఇది మంచి అవకాశమని ఆయన చెప్పారు. ప్రస్తుత సంవత్సర కంపెనీల ఫలితాలు నిజ పరిస్థితిని ప్రతిబింబించవన్నారు. ప్రస్తుత రేట్ల తగ్గింపు తదితర ఉద్దీపనలు వచ్చే ఏడాదికి మంచి ఫలితాలిస్తాయన్నారు. తక్షణమైతే డిమాండ్‌ పుంజుకోవడమే సమస్యని చెప్పారు. గతం బాగాలేనప్పుడు భవిష్యత్‌ ఆశాజనకంగా ఉంటుందని వివరించారు. 
ఏంచేయొచ్చు?
ఇండియాకు అల్పవడ్డీరేట్లు, అల్ప క్రూడాయిల్‌ ధరలు కలిసివస్తాయని జైన్‌ చెప్పారు. ఇవి రెండూ కలిసి ఇండియాలో మంచి పెట్టుబడి అవకాశాలు కల్పిస్తాయన్నారు. లాక్‌డౌన్‌తో ఈ ప్రయోజనాలు పొందే అవకాశం తగ్గిందని, తిరిగి అన్నీ గాడినపడేందుకు సమయం పడుతుందని తెలిపారు. లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు ఈ ఏడాదిని పట్టించుకోకుండా ముందుకుసాగాలన్నారు. రంగాలవారీగా యుటిలిటీలు, టెలికం, పీఎస్‌యూ ఆయిల్‌, సిమెంట్‌, ఐటీ, ఫార్మాలను పెట్టుబడులకు పరిశీలించవచ్చని సూచించారు. షేర్లవారీగా ఎయిర్‌టెల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఓఐఎల్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, కాల్గెట్‌, బజాజ్‌కన్జూమర్‌ లాంటివి పరిశీలించవచ్చన్నారు. ఆటో, హోటల్స్‌, లగ్జరీగూడ్స్‌, వస్త్రాలు, పాదరక్షల్లాంటి రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటాయని అంచనా వేశారు.