https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/mbnr.jpg?itok=DeYxSyWT
జక్లేర్‌లో పీపీఈ కిట్లను ధరించి బయటికి ఎవరూ రావొద్దంటూ సూచిస్తున్న వైద్య బృందం

మహబూబ్‌నగర్‌లో మళ్లీ కరోనా అలజడి



మహబూబ్‌నగర్‌ క్రైం/ నారాయణపేట: మరో సారి కరోనా కేసు నమోదు కావడంతో నారాయణపేట జిల్లాలో కలవరం చెందుతున్నారు. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్నామని అనుకున్నా వారందరికీ తాజాగా నాలుగు నెలల బాబుకు కరోనా పాజిటివ్‌ రావడంతో టెన్షన్‌ పట్టుకుంది. మక్తల్‌ మండలం జక్లేర్‌లోని ఈ బాబుకు మంగళవారం కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో జిల్లాలో కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇద్దరు చిన్నారులే కావడం గమనార్హం. ఈనెల 23వ తేదీ ఉదయం బాబుకు దగ్గు, జలుబు, జ్వరం రావడంతో మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా స్థానిక వైద్యులు పరీక్షించి మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అదేరోజు రాత్రిబాబును హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు పంపించగా పాజిటివ్‌ అని నిర్ధారించారు. 

ఎవరి వల్ల సోకింది?
ఈ బాబుకు ఎవరి వల్ల వైరస్‌ సోకిందనేది ఇప్పుడు అందరినీ తొలిచివేస్తోంది. కాగా, గత ఫిబ్రవరి 17న మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించగా 19న డిశ్చార్జ్‌ చేయడంతో అప్పటి నుంచి తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈనెల 14న స్వగ్రామంలో డోలారోహణం నిర్వహించారు. దీనికి పారేవుల నుంచి పది మంది, మక్తల్‌ మండలంలోని ఐదు గ్రామాల నుంచి 50మంది, స్వగ్రామానికి చెందిన మరికొందరు హాజరయ్యారు. ఆ తర్వాత సరిగ్గా 12రోజుల తర్వాత బాబుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులు, ఇతరులు ఇలా ప్రతి ఒక్కరూ బాబు ఎత్తుకున్నారు. తండ్రి సూర్యపేటకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ హైరిస్క్‌ ఏరియాలో ఆయన తిరిగినట్లు సమాచారం. ఈ సంఘటనతో జక్లేర్‌లో అధికారులు రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. దీంతో పాటు ఆ బాబును కలిసి వారిలో ప్రైమరీ, సెంకడరీ కాంటాక్స్‌ ఎంత మంది ఉన్నారనేది గుర్తించే పనిలో వైద్యారోగ్యశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

రెనివట్లలో మొదటి కేసు  
నారాయణపేట జిల్లాలోని మద్దూర్‌ మండలం రెనివట్లకు చెందిన రెండు నెలల బాబుకు గత నెల 17న కరోనా సోకడంతో తొలికేసు నమోదైంది. ఆ బాబుకు సంబంధించి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులకు పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్‌ వచ్చింది. అయితే ఆ చిన్నోడిని కరోనా రెండు రోజుల్లోనే కాటేసి నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటనతో జిల్లా 21 రోజుల పాటు రెడ్‌ జోన్‌.. ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లోకి వచ్చింది. అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఆ చిన్నారులు పుట్టింది ఫిబ్రవరిలోనే
గత నెల 17న కరోనా బారిన పడి మృతి చెందిన రెండు నెలల బాబు గత ఫిబ్రవరి 22న నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో జన్మించాడు. నిమోనియాతో బాధపడటంతో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ ప్రైవేట్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో, జనరల్‌ ఆస్పత్రిలో చూపించినా తగ్గలేదు. చివరకు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి గతన 16న తీసుకెళ్లగా 17న కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల్లోనే కరోనా కాటేయడంతో కన్నుముశాడు. ఆ సంఘటన మరవకముందే జక్లేర్‌కు చెందిన గుంపు మేస్త్రీకి మూడో సంతానంగా గత ఫిబ్రవరి17న జన్మించిన బాబుకు ఈనెల 14న డోలారోహణం చేశారు. అయితే మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో మక్తల్‌ ఆస్పత్రికి వెళ్లారు. పరిశీలించిన వైద్యులు మహబూబ్‌నగర్‌కు రేఫర్‌ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించి చికిత్సలు చేయగా కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలాఉండగా ఈ ఇద్దరు చిన్నారులు పుట్టిన వేళనేమో గాని కరోనా బారిన పడుతుండటంతో జనమంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు కేసులు చిన్నారులవే కావడంతో కలవరపడుతున్నారు.

పెరుగుతున్న వలస కూలీలు
బతుకుదెరువు కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మహారాష్ట్రకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం నాటికి పాల మూరు జిల్లాకు 15,554 మంది వలస కూలీలు వచ్చారు. వీరిలో 5,314మందికి హోం క్వారంటైన్‌ పూర్తి కాగా 10,240 మంది ఇంకా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ముఖ్యంగా ముంబై, పుణె నుంచి వచ్చిన వారి విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని పెడుతోంది.

జక్లేర్‌లో రెడ్‌అలర్ట్‌
మహబూబ్‌నగర్‌ నుంచి రాయచూర్‌ ప్రధాన రహదారిపై నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ మండలం జక్లేర్‌ ఉంది. అయితే గతేడాది దిశ అత్యాచారం.. హత్య కేసులో సంచలనం సృష్టించిన ఈ గ్రామం.. తాజాగా కరోనాతో మరోసారి తెర పైకి వచ్చింది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల వారు సైతం జక్లేర్‌ అనగానే దిశ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంఘటనతో 15 రోజుల పాటు గ్రామమంతా నిర్మానుష్యంగా మారగా ప్రస్తుతం కరోనాతో రెడ్‌ అలర్ట్‌లో పడినట్టయింది.