https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/harish.jpg?itok=1vLTAmyi
సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన కలెక్టర్, సీపీ

29న సిద్ధిపేటకు సీఎం కేసీఆర్‌



సిద్దిపేటజోన్‌:  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తరలించే మహోత్తర ఘట్టంలో మరో దృశ్యం 29వ తేదీన ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా గోదావరి జలాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా వైభవంగా ఈ వేడుక జరుగనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం  ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు  కలెక్టరేట్‌లో  కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి,  పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌డేవిస్‌తో పాటు జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.  కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే మరో వైపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కొండపొచమ్మ రిజర్వాయర్‌నుత్వరలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం ఆలోచన అమలుకు రిజర్వాయర్‌ల నిర్మాణం వెనుక జిల్లా అధికారుల కృషి చాలా ఉందని, ప్రతి శాఖ నిద్రలేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్ని రంగాల్లో  జిల్లాను తొలి స్థానంలో నిలుపుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. జిల్లాలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు సీఎం కేసీఆర్‌ కార్యక్రమాలను చాలా చేశామని, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రశంసలు పొందామని,  అలాగే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహిద్దామని మంత్రి అధికారులకు సూచించారు. ప్రధానంగా ప్రçస్తుత కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అధికార వర్గాలకు సూచించారు. కార్యక్రమం మొదటి నుంచి ముగిసే వరకు సీఎం పర్యటనలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, శాఖల వారీగా ఏర్పాట్లు, ఇతరాత్ర నిర్వహణ బాధ్యతలపై మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లాకు చెందిన   అధికారులు, నాయకులు రాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.