https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/opening%20in%20flat.jpg?itok=5nqg0PCo

150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌



అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరిగి 30759 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు లాభంతో 9078 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ప్రారంభం కావడ విశేషం.

సన్‌ఫార్మా, డాబర్‌ ఇండియా, యూనిటైడ్‌ స్పిరిట్స్‌ కంపెనీలతో పాటు సుమారు 22 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించే అవకాశం ఉంది. గురువారం (రేపు) మే నెల డెరివేటివ్స్‌ ముగియనున్న కారణంగా ఇంట్రాడేలో ఆటుపోట్లకు చాన్స్‌ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచే అంశంగా ఉంది. 

ఉదయం గం.9:ని.లకు సెన్సెక్స్‌ 110 పాయింట్ల లాభంతో 30719 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 9061 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ‍ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు లాభపడుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 17620 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

హాంకాం‍గ్‌ జాతీయ భ‌ద్రత‌కు సంబంధించి చైనా రూపొందించిన వివాదస్పద చట్టంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని విధించే ప్రయత్నంపై చైనాపై ఈ వారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం తెలిపారు. అయితే ఎలాంటి చర్చలు తీసుకుంటారో అనే అంశంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అమెరికా - చైనాల మధ్య మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు తెరపైకి రావడంతో 2రోజులుగా లాభాల్లో ట్రేడైన ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, ఇండోనేషియా, చైనాల దేశాలకు చెందిన సూచీలు అరశాతం వరకు నష్టపోయాయి. కొరియా, థాయిలాండ్‌, తైవాన్‌ దేశాల ఇండెక్స్‌ స్వల్పలాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటర్స్‌, యూపీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌, హిందాల్కో షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం పెరిగాయి. గెయిల్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ఫిన్‌ సర్వీసెస్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి.