https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/cab.jpg?itok=HXRBD57q

పీక్‌ అవర్స్, సర్‌చార్జీల పేరిట బాదుడు



సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు సాధారణ రోజుల్లో క్యాబ్‌ చార్జీ రూ.550 వరకు ఉంటుంది. కానీ రెండు రోజుల క్రితం ఒక ప్రయాణికుడు ఏకంగా రూ.923 చెల్లించాడు. కూకట్‌పల్లి నుంచి సికింద్రాబాద్‌ వరకు సాధారణంగా అయితే రూ.250 నుంచి రూ.300 వరకు ఉంటుంది. ఇప్పుడు అది రూ.450 నుంచి రూ.500 దాటిపోయింది. ఈ ఒకటి, రెండు రూట్‌లలోనే కాదు. లాక్‌డౌన్‌ వేళ నగరంలో క్యాబ్‌ చార్జీల దోపిడీ ‘పీక్‌’ స్థాయికి చేరింది. లాక్‌డౌన్‌ నడలింపుల్లో భాగంగా కొద్ది రోజులుగా ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు  రోడ్డెక్కాయి. ఆటోలు పూర్తిస్థాయిలో తిరుగుతున్నప్పటికీ క్యాబ్‌లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఓలా, ఊబెర్‌ వంటి బడా సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో సర్వీసులను ప్రారంభించలేదు.

మరోవైపు  సిటీబస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌ సర్వీసులు వంటి ప్రజారవాణా సంస్థలపైన ఇంకా ఆంక్షలు కొనసాగుతూండడంతో క్యాబ్‌లకు డిమాండ్‌ పెరిగింది. కానీ ఇందుకు తగినట్లుగా వాహనాలు అందుబాటులో ఉండడం లేదు.దీంతో ప్రయాణికుల అవసరాన్ని  క్యాబ్‌ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి.నగరంలోని హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్,అమీర్‌పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి వంటి  ప్రయాణికుల  రాకపోకలు, డిమాండ్‌ ఎక్కువగా ఉన్న  ప్రాంతాల్లో  క్యాబ్‌ సంస్థలు రెట్టింపు చార్జీలకు పాల్పడుతున్నట్లు  ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో క్యాబ్‌ ఎక్కాలంటే కనీసం రూ.వెయ్యి ఉండాల్సిందేనంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

‘పీక్‌’ అవర్స్‌పేరిట దోపిడీ..
సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి  10 గంటల వరకు, సాయంత్రం  5 నుంచి 7 గంటల వరకు పీక్‌ అవర్స్‌గా పరిగణిస్తారు. అంతా ఒకే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడం, తిరిగి సాయంత్రం ఒకే సమయంలో ఇళ్లకు వెళ్లడం వల్ల రోడ్లపై ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని పీక్‌ అవర్స్‌గా పరిగణిస్తారు. కానీ ఈ రద్దీ వేళల్లో చార్జీలు పెంచాలనే నిబంధన ఎక్కడా లేదు. పైగా మోటార్‌ వాహన చట్టం ప్రకారం పీక్‌ అవర్స్‌ (రద్దీ వేళలు), స్లాక్‌ అవర్స్‌ (రద్దీ లేని సమయాలు)గా విభజించి చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు.కానీ క్యాబ్‌ సంస్థలు మాత్రం రహదారులపైన రద్దీ ఉన్నా లేకున్నా  పీక్‌ అవర్స్‌ పేరిట చార్జీలను  అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా ఐటీ సంస్థల్లో కేవలం 30 శాతం ఉద్యోగులే కార్యాలయాలకు వెళ్తుండగా మిగతా వాళ్లు ఇంకా ఇళ్లల్లోంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా కొన్ని కార్యకలపాలపైన లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాహాల్స్, రెస్టారెంట్స్, హోటళ్లు, బార్లు వంటివి మూసే ఉన్నాయి. రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా సాయంత్రం 6 గంటలకు జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎలాంటి రద్దీ లేని ప్రస్తుత లాక్‌డౌన్‌ వేళలో పీక్‌ అవర్స్‌ పేరిట  అదనపు వసూళ్లకు  పాల్పడడం గమనార్హం.

ఈ సమయంలో సర్‌చార్జీలా..
సాధారణంగా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సమయంలో స్థానికంగా క్యాబ్‌లు అందుబాటులో లేకపోతే సర్‌చార్జీ విధిస్తారు. దూరంగా ఉన్న వాహనాలను రప్పించేందుకు సర్‌చార్జీల రూపంలో వడ్డిస్తారు. రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఇలాంటి వడ్డింపులు ఉంటాయి. కానీ ఎలాంటి రద్దీ లేని ప్రస్తుత సమయంలో ఈ తరహా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

కోవిడ్‌ నిబంధనలు హుష్‌..
ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే  ఒకటి, రెండు క్యాబ్‌ సంస్థలకు చెందిన వాహనాలు మినహా నగరంలో తిరిగే క్యాబ్‌లలో కోవిడ్‌ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. వాహనాలను శానిటైజ్‌ చేయడం లేదు. ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య ఫైబర్‌ షీట్‌ ఉండడం లేదు. బడా క్యాబ్‌ సంస్థలు తమ సర్వీసులను ఫ్రారంభించినప్పటికీ  డ్రైవర్‌ భాగస్వాములకు ఎలాంటి మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం లేదని, వాహనాలను శానిటైజ్‌ చేసే సదుపాయం కల్పించడం లేదని తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మెన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో క్యాబ్‌లు నడిపేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.