https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/sun.jpg?itok=l2S0Ktln

రోహిణితో జాగ్రత్త

సాక్షి, ఒంగోలు మెట్రో: రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగులుతాయనే నానుడి అనేకసార్లు నిజమైంది. రెండు రోజుల కిందట వచ్చిన రోహిణి కార్తె ఎండలతో జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు. మనకి నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దికొద్దిగా ఉగాది నుంచి తాపం పెరుగుతూ ఉంటుంది. దిన దిన ప్రవర్ధమానంగా సూర్యుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తుంటాడు. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే, ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఉండే ఎండలు మరీ అదరగొడతాయి.

మే నెల 25 సోమవారం నుంచి జూన్‌8వ తేదీ సోమవారం వరకు మొత్తం 15 రోజుల పాటు రోహిణి కార్తె ఉంటుంది. ఈ రోహిణి కార్తె సోమవారం ఉదయం 6.30 నిమిషాలకు ప్రవేశించింది. అప్పటి నుంచీ ఎండవేడి త్రీవమైంది. వాతావరణంలో మార్పులు సంభవించాయి. అడపదడపా మేఘ ఘర్జనలు, రాత్రులలో వేడి గాలలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల చిన్నచిన్న జల్లుల వర్షం పడింది. అప్పటి నుంచి ఉక్కపోత మరీ అధికం అయింది.  

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/1.jpg

పక్షుల కోసం ప్రత్యేక ఏర్పాటు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
► రోహిణి కార్తె ఫలితంగా ఎండ తీవ్రతకు శరీరం వెంటవెంటనే అలసిపోతుంది.  ఆరోగ్య రీత్యా తగువిధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  
► ఎక్కువగా మట్టికుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగిజావ, ఫలూదా వంటివి ఆయా వేళల్లో తీసుకుంటూ ఉండాలి.  ఎక్కువగా ఇవి స్వీకరించటం వల్ల ఆరోగ్యానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఉపశమనం కూడా కలుగుతుంది.  
► వేడిని కలిగించే మసాలా పదార్థాలకు సంబంధించిన ఆహార పదార్థాలు, వేపుళ్లు, పచ్చళ్లు, ఎక్కువ ఆయిల్‌ కలిగిన ఆహార పదార్థాలు తినరాదు.  
► నీళ్ల సౌకర్యం సమృద్ధిగా ఉన్నవారు రెండుపూటలా తప్పకుండా స్నానం చేయటం ద్వారా ఫలితం ఉంటుంది.  
► అన్ని వయసుల వారూ ఎక్కువగా కాటన్‌ దుస్తులు ధరించడం ద్వారా తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది.  
► చిన్నపిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి గుడ్డతో తుడిచి బట్టలు మార్చాల్సి ఉంటుంది.  
► ఈ కాలంలో ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.  
► మనకు లాగే పశుపక్ష్యాదులకూ ఈ కార్తెలో ఇబ్బందులు ఎక్కువే.  సాటి జీవులైన పశుపక్ష్యాదులకు తాగటానికి మనం నివసించే చోట ఆరుబయట ప్రదేశంలో గింజలను, నీటిని ఏర్పాటు చేయండి.