https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/suicide.jpg?itok=DS-PPwlc

క్షణికావేశం.. గర్భశోకం

మొబైల్‌ తీసివ్వలేదనో..బైకు కొనివ్వలేదనో..పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు తిట్టారనో..  బిడ్డలు క్షణికావేశానికి లోనవుతున్నారు.అమ్మానాన్నల ప్రేమను పిల్లలు పొందలేకపోతున్నారు.మంచి మాటలు చెప్పినా చిర్రెత్తుకొస్తోంది.క్షణికావేశం గర్భశోకం మిగులుస్తోంది.ఎప్పుడూ ఆటలేనా.. చదువుకోవచ్చుకదా అంటూ.. మందలించడం ఓ పిల్లాడికి మరణ శాసనమైంది. నిండా 11 ఏళ్లు లేని బాలుడు వందేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా చాలించిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. 

అనంతపురం క్రైం: కన్నతల్లి మందలించిందని 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలోని రాంనగర్‌లో చోటు చేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెల్పిన వివరాల మేరకు... నారాయణస్వామి, లక్ష్మి దంపతులకు పాప, బాబు సంతానం. కుమారుడు రోహిత్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఆటలాడి ఇంటికొచ్చిన కుమారున్ని తల్లి లక్ష్మి ‘ఎండలో తిరిగితే ఎలా నాన్న? చదువుకోవాలి కదా?’ అంటూ మందలించింది. దీంతో కుమారుడు ఆవేశంతో బాత్‌రూంలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. బాత్‌రూం తలుపులు పగలగొట్టి చూసే లోపు కుమారుడు విగతజీవిలా కన్పించాడు. అయ్యో భగవంతుడా?ఎంత పనిచేశావయ్యా అంటూ ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. చుట్టుపక్కల వారు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సీఐ కే శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.