అత్యాచారయత్నం!.. సోషల్ మీడియాలో పోస్టు
- ప్రతిఘటించడంతో దాడి
- అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు
- రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు ప్రచారం
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
- కేసు నమోదు చేసిన షాద్‌నగర్ పోలీసులు
షాద్‌నగర్ రూరల్: ఓ యువతీయువకుడు కొన్నిరోజులుగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుంటానని యువకుడు ఆమెను నమ్మబలికాడు. అతడిని నమ్మి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఠాణా పరిధిలో వెలుగుచూసింది. యువతి కుటుంబీకుల కథనం ప్రకారం.. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన యువతి(24) కొన్ని నెలల క్రితం షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుండేది. పట్టణంలో వాటర్ సప్లయ్ ఆటో నడుపుతున్న షాద్‌నగర్ మండల పరిధిలోని రాసుమల్లగూడకు చెందిన యువకుడు భానుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి తిరిగారు. కొద్దిరోజుల తరువాత యువతి షాద్‌నగర్ ఆస్పత్రిలో మానేసి కొందుర్గు మండల కేంద్రలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో పనిచేస్తోంది. అయితే, ఈనెల 24న ఉదయం 11గంటలకు మాట్లాడుకుందాం అని చెప్పిన భాను యువతిని కొందుర్గు నుంచి బైకుపై షాద్‌నగర్ వైపు తీసుకువచ్చాడు.
మండల పరిధిలోని ఎలికట్ట శివారులోని ఓ పరిశ్రమ వెనుక వైపు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా యువతి ప్రతిఘటించింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో భాను యువతిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం మొగిలిగిద్ద శివారులోని రంగసముద్రం శివారులో వదిలేశాడు. గాయపడిన ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు ప్రచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు అదేరోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. సోమవారం కొందుర్గు పోలీసులకు సమాచారం ఇచ్చి గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన షాద్‌నగర్ ఠాణా పరిధిలోకి రావడంతో యువతి మంగళవారం షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. అయితే, అక్కడ రక్తపు మరకలు, మద్యం బాటిళ్లు, కూల్‌డ్రింక్ బాటిళ్లు ఉండటంతో యువతిపై భాను ఒక్కడే అత్యాచారయత్నం చేశాడా... అతడితోపాటు మరికొందరు ఉన్నారా.. అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియ రాలేదని, ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, భానును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.