https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/auto.jpg?itok=263jgTPv

రాష్ట్రంలో ట్యాక్సీ.. ఆటోలకు అనుమతి!



రవాణా సేవల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వైపుగా ట్యాక్సీ, ఆటోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  జూన్‌ ఒకటో తేదీ నుంచి మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంటీసీ బస్సు సేవలకు చర్యలు చేపట్టారు.  

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో నాలుగో విడత లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినానంతరం ఆంక్షల సడలింపులు ప్రజలకు ఊరటగా మారాయి. మాల్స్, థియేటర్లు, వినోద కేంద్రాల తప్పా మిగిలిన అన్ని రకాలు దుకాణాలు దాదాపుగా తెరచుకున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. విమానాల సేవలు మొదలయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై నుంచి విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే ఆశించిన మేరకు ప్రయాణికులు విమానాశ్రయాల వైపు వెళ్లడం లేదు. దీంతో అనేక విమాన సేవలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక జూన్‌ ఒకటి నుంచి రైళ్ల సేవలు మొదలు కానున్నాయి. ప్రస్తుతానికి చెన్నై మినహా, మిగిలిన మార్గాల్లో వలస కార్మికుల కోసం ప్రత్యేక రైలు పట్టాలెక్కుతున్నాయి. ఈపరిస్థితుల్లో జూన్‌ ఒకటి నుంచి చెన్నై వైపుగా రైళ్లు దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు తగ్గ చర్యలపై దృష్టి పెట్టింది. 

ట్యాక్సీ, ఆటోలకు ఒకే.. 
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తెరచుకున్న దృష్ట్యా ఈ సేవలు క్రమంగా విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు వచ్చే వారి రవాణా కోసం ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాల వైపుగా ట్యాక్సీలకు అనుమతి ఇచ్చారు. అలాగే, ఆటోలకే ఓకే చెప్పేశారు. ఇక రైళ్ల సేవలు మొదలు కానున్న దృష్ట్యా ఆయా స్టేషన్లకు సైతం ఆటో, ట్యాక్సీలకు అనుమతి ఇస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చెన్నై నగరంలో మెట్రో రైలు సేవలకు చర్యలు చేపట్టారు. జూన్‌ ఒకటో తేది నుంచి మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశాలు  ఉన్నాయి. అయితే ఈ రైళ్లకు ఏసీ సౌకర్యం తప్పని సరి. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలపై మెట్రో వర్గాలు సిద్ధమవుతున్నాయి. 

ఎంటీసీ బస్సు సేవలు... 
చెన్నై వంటి నగరాల్లో ఎంటీసీ బస్సుల సేవల పునరద్ధరణ కసరత్తులు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని మార్గాల్లో ఎంటీసీ బస్సులు నడుస్తున్నాయి. చెన్నైలో తొలుత ఎంటీసీ సేవలకు శ్రీకారం చుట్టి, ఆ తదుపరి ఇతర నగరాలపై దృష్టి పెట్టే అవకాశాలు  ఉన్నాయి. ఎంటిసీ బస్సు సేవల కోసం ప్రత్యేక యాప్‌ను ప్రకటించబోతున్నారు. జీపీఎస్‌ సౌకర్యంతో, స్టాపింగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు తెలిసే రీతిలో బస్సుల్లో అమరికలు సాగుతున్నాయి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి, ఏ మార్గాల్లో బస్సులు పయనిస్తున్నాయో అన్న వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి అనుమతి అన్నట్టుగా కసరత్తులు చేపట్టారు. చెన్నై నగరంలో 3200 బస్సులు ఉన్నా, ఇందులో 500 బస్సుల్లో ఈ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం.