ఖైదీ నంబర్ 4414
- 9 మంది హత్య ఘటనపై మక్సూద్ బంధువులు
- ఏడు మృతదేహాలు అప్పగింత మత పెద్దల సమక్షంలో
- అంత్యక్రియలు పూర్తి మరో రెండు మృతదేహాలు మార్చురీలోనే..
గొర్రెకుంటలో తొమ్మిది మంది హత్యకు గురైనసంఘటనకు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ బంధువులు పేర్కొన్నారు. ఒక్కడే ఇంత మందిని హత్యచేసి ఉండడని, ఇతరుల సహకారం తీసుకుని ఉంటాడని, ఘటనపై మరింత సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
ఎంజీఎం : తొమ్మిది మందిని ఒక్కడే పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు పేర్కొన్న వివరణపై పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గొర్రెకుంటలో హత్యకు గురైన వారి మృత దేహాలు ఎంజీఎం మార్చురీలో ఉండగా.. తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు మొదట మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిషా సోదరుడు ఫిరోజ్ షా మాట్లాడుతూ తొమ్మిది మందిని సంజయ్‌కుమార్ యాదవ్ హత్య చేశాడని పోలీసులు పేర్కొంటున్నాడని, ఇంత మందిని ఒక్కడే ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. ఈ ఘటనలో సంజయ్‌కుమార్‌కు మరికొంత మంది సహాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఆయన మరింత సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.(వరంగల్ జైలుకు సంజయ్ )
మృతదేహాల అప్పగింత
గొర్రెకుంటలో హత్యకు గురైన తొమ్మిది మందిలో ఏడుగురి అంత్యక్రియలను మంగళవారం ముస్లిం మత పెద్ద వారి బంధుమిత్రుల మధ్య నిర్వహించారు. ఉదయం పశ్చిమ బెంగాల్ నుంచి మృతుడి బంధువులు వరంగల్‌కు చేరుకోవడంతో ఎండీ మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలం, కుమారులు ఎండీ షాబాద్ ఆలం, కూతురు బుస్రా ఖాతూ, మనవడు బబ్లూ మృతదేహాలను గీసుగొండ ఇన్‌చార్జి తహసీల్దార్ సుహాసిని, రాయపర్తి తహసిల్దార్ సత్యనారాయణ, గీసుగొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అర్బన్ పంచనామా అనంతరం అప్పగించారు. పోతనరోడ్డులోని ఖబరస్థాన్‌లో అంత్యక్రియలను పూర్తి చేశారు.(పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?)
ఆందోళన అనంతరం షకీల్ మృతదేహం అప్పగింత..
మక్సూద్ కుటుంబ సభ్యులకు ఆరు మృతదేహాలను అప్పగించిన అనంతరం షకీల్ మృతదేహాన్ని తమకు ఇవ్వకపోవడంతో షకీల్ భార్య తాహేరా బేగం పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టింది. షకీల్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారని, ఎవరికి మృతదేహం అప్పగించాలనే విషయమై అధికారులు ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో షకీల్ మొదటి భార్యకు విడాకుల ప్రక్రియ పూర్తయిందని షకీల్ సోదరుడు సజ్జర్‌తో వివరణ తీసుకున్న అనంతరం రెండవ భార్య తాహెర బేగంకు మృతదేహాన్ని అప్పగించారు. ఈమృతదేహానికి సైతం ముస్లిం మత పెద్దలు స్థానిక కార్పొరేటర్ రిజ్వానా షమీమ్ మసూద్, కల్పలత సూపర్‌బజార్ వైస్‌చైర్మన్ ఎం.డీ.షఫీ సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.(మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం)
నిందితుడికి 14 రోజుల రిమాండ్
వరంగల్ లీగల్ : తొమ్మిది మందికి మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో వేసి హత్య చేసి నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌యాదవ్‌ను గీసుకొండ పోలీసులు మంగళవారం మూడవ ముస్సిఫ్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి కుమారస్వామి ఎదుట హాజరుపర్చారు. అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జి జూన్ 8న తిరిగి హాజరుపర్చాలని ఆదేశించారు. నిందితుడిపై హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించడం, విషప్రయోగం ద్వారా కిడ్నాప్ చేయడం, చనిపోయిన వ్యక్తులకు చెందిన వస్తువులను దురుద్దేశ్యంతో స్వాధీనం చేసుకోవడం, దొంగతనం చేసి హత్య నేరానికి పాల్పడిన అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 449, 328, 364, 380, 404, 302, 210 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
నిందితుడిపై సెక్షన్లు..
ఐపీసీ సెక్షన్ 449 : హత్య చేయాలని ఉద్ధేశంతో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం
♦ ఈ నేరం రుజువైతే నిందితుడికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా
సెక్షన్ 328 : నేరానికి పాల్పడాలనే ఉద్ధేశంతో విషప్రయోగం చేయడం 10 సంవత్సరాల కారాగార శిక్ష మరియు జరిమానా
సెక్షన్ 364 : హత్య చేయడానికి మృతుడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి కిడ్నాప్ చేయడం యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా
సెక్షన్ 380 : దొంగతనం చేయడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా
సెక్షన్ 404 : చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను తెలిసి తీసుకోవడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష
సెక్షన్ 302 : హత్యా నేరం ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా
సెక్షన్ 210 : బాకీ లేని అప్పు లేదా ఉన్నదానికంటే ఎక్కువ బాకీ డబ్బుల కోసం దురుద్ధేశంగా ఆర్డర్ తీసుకోవడం ,రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా శిక్ష + జరిమానా
ఖైదీ నంబర్ 4414 : హై సెక్యూరిటీ బ్యారక్‌కు నిందితుడు
వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట వద్ద బావిలోని తొమ్మిది మందిని, అంతకు ముందు ఒకరి హత్య కేసులోని నిందితుడైన సంజయ్‌కుమార్‌యాదవ్‌ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించగా హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచారు. అంతకు ముందు అతడికి ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రిమాండ్ ఖైదీ సంజయ్‌కుమార్‌కు 4414 నంబర్ కేటాయించినట్లు జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు.
మార్చురీలోనే మరో రెండు మృతదేహాలు..
తొమ్మిది మందిలో బీహార్‌కు చెందిన ఇద్దరి మృతదేహాలు ఎంజీఎం ఫ్రీజర్‌లలోనే ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు వరంగల్‌కు వస్తున్నారని, ఇక్కడకి చేరుకున్నాక అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.