https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/kanna-2.jpg

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మెబీనా దుర్మరణం..

కన్నడ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వర్ధమాన నటి మెబీనా మైఖేల్ చనిపోయింది. ఆమె వయసు 22 సంవత్సరాలు. తన స్వస్థలం మెడికెరికి వెళ్తుండగా దేవీహళ్లి దగ్గర ఓ ట్రాక్టర్‌ ఆమె కారుపైకి దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెబీనాను సమీప ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మరణించినట్లు స్థానికులు తెలిపారు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన మెబీనా ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మెబీనా.. నిబంధనల సడలింపుల నేపథ్యంలో సొంతూరికి వెళ్లేందుకు పయనమై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మెబీనా మరణవార్తతో ఆమె స్నేహితులు, టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో పీహెచ్‌హెచ్‌ఎల్‌ 4 హోస్ట్‌ అకుల్‌ బాలాజీ ట్విటర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘నా ఫేవరెట్‌ కంటెస్టెంట్‌ ఆకస్మిక మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. మెబీనా చిన్న పిల్ల. తను చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. కానీ ఇంతలోనే ఇలా. ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ ’అంటూ మెబీనాకు ట్రోఫీ అందిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. మెబీనా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బుల్లితెరపై క్రేజ్ పెంచుకుంది. 19 ఏళ్ల వయసులోనే రియాలిటీ షోకు వెళ్లి 12 మందిని దాటేసి విజేతగా నిలిచింది. ఇంత చిన్న వయసులోనే మంచి టాలెంటెడ్ నటిని కోల్పోవడం చాలా బాధగా ఉందని కన్నడ సినీ ప్రముఖులు అన్నారు. ఆమె కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు.