న్యూఢిల్లీ: వలస కూలీలకు విమాన టికెట్లు బుక్ చేసిన రైతు
లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకుని అనేక యాజమాన్యాలు కార్మికులను నడిబజార్లో వదిలేస్తున్న తరుణంలో.. ఢిల్లీకి చెందిన ఓ రైతు తన కూలీల పట్ల పెద్ద మనసు చాటుకున్నాడు. ఎక్కడో బీహార్లోని తమ ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమని గడుపుతున్న పదిమంది వలస కూలీలకు విమాన టికెట్లు బుక్‌చేశాడు. గురువారం సాయంత్రం 6 గంటలకు బీహార్ రాజధాని పాట్నాకు వారు వెళ్లాల్సిన విమానం బయల్దేరనుంది. ఏప్రిల్ నెలలోనే ఇళ్లకు వెళ్దామని ప్లాన్ చేసుకున్న వీరంతా… సమస్తిపూర్ జిల్లాలోని తమ స్వగ్రామాలకు ఇంత సులభంగా వెళ్తామని ఊహించలేదని చెబుతున్నారు. వేలాది కిలోమీటర్ల దూరంలో తమ స్వస్థలాలకు కాలినడకనో, సైకిళ్ల మీదో లేదా బస్సులు, రైళ్లలో సీట్ల కోసం తిప్పలుపడుతూనో వెళ్తామని అనుకున్నామనీ.. కానీ విమానంలో వెళ్తామని కలలో కూడా ఊహించలేదని కూలీలు చెబుతున్నారు.
‘‘నా జీవితంలో విమానం ఎక్కుతానని ఎప్పుడూ ఊహించలేదు. నా ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు మాటలు చాలవు. రేపు నేను విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత ఏంచేయాలో తెలియక కొంత కంగారుగా కూడా ఉంది..’’ అని లఖీందర్ రామ్ అనే కార్మికుడు పేర్కొన్నాడు. తమ యజమాని పప్పాన్ సింగ్‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నాడు. పప్పాన్ సింగ్ ఢిల్లీలోని తిగిపూర్ గ్రామంలో పుట్టగొడుగులు పండిస్తుంటాడు. లాక్‌డౌన్‌లో జీతాలకు సైతం నోచుకోక ఖాళీ కడుపులు, కాలినడకతో ఇంటికి చేరుకుని అస్వస్థతకు, చావులకు గురవుతున్న వలస కార్మికుల రాతను ఓ రైతు తిరగ రాయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.