నిజామాబాద్ : మిడతల దండు ప్రమాదం పొంచి ఉంది: కలెక్టర్
మిడతల దండు దాడి చేసే ప్రమదాం ఉన్నందున వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ మిడతలదండు నుంచి రైతులు తమ పంటలను కాపాడుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్ర లోని వార్దా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నదని, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితులలో మిడతలు విజృంభిస్తూ గంటకు 5 నుండి 130 కిలోవిూటర్ల వేగంతో గాలులతోపాటు పయనిస్తాయని, దాదాపు అన్ని రకాల పంటలపై దాడి చేసి తింటాయని, కాబట్టి రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మిడతల దండు పంటలపై దాడి చేస్తే పంటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ.. పంటలను కాపాడుకోవాలని సూచించారు. మిడతలను పరిసర ప్రాంతాలలో గమనించినట్లయితే తమ పంటలలోకి రాకుండా డబ్బాలు, మెటల్ ప్లేట్లు, డ్రమ్ములు, రేడియో లేదా లౌడ్ స్పీకర్ వంటి ఎలక్టానిక పరికరాలతో శబ్దం చేసి పంటలను రక్షించుకోవచ్చన్నారు. పై మార్గదర్శకాలు పాటించి రైతులు పంటలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.