http://www.prajasakti.com/./mm/20200527//1590565471.mahanadu---2020.png

టిడిపికి కార్యకర్తలే మహాబలం : చంద్రబాబు

* టిడిపి మహానాడు ప్రారంభం
            అమరావతి : టిడిపికి కార్యకర్తలే మహాబలమని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రతి ఏడాదీ టిడిపి వైభవంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా చంద్రబాబునాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులు దాదాపు 14 వేల మంది జూమ్‌ యాప్‌ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రెండు రోజులు మాత్రమే నిర్వహించనున్నారు.
                                      నాకు ప్రాణ సమానులైన కార్యకర్తలారా..!
          ఈ సందర్భంగా చంద్రబాబు ''నాకు ప్రాణ సమానులైన టిడిపి కార్యకర్తలారా...''అంటూ అధ్యక్షోపన్యాసాన్ని ప్రారంభించారు. అనంతరం ఎల్‌జి పాలిమర్స్‌ మృతులకు సంతాపం తెలిపారు. విశాఖలో గ్యాస్‌ లీక్‌ జరిగినప్పటికీ లాక్‌డౌన్‌ వల్ల అక్కడకు వెళ్లలేకపోయానని అన్నారు. కార్యకర్తలు, నాయకుల మతికి సంతాపం తెలిపారు. విశాఖ దుర్ఘటన జరగ్గానే విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరానని అన్నారు. తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరానని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రానందునే వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చారు. ఇప్పటిదాకా స్టైరీన్‌ గ్యాస్‌ తీవ్రతపై శాస్త్రీయ పరిజ్ఞానం లేదన్నారు. బాధితులకు అండగా నిలబడ్డ ప్రతిపక్ష నేతలపై కేసులు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన రంగనాయకమ్మ, తదితరులపై కేసులు పెట్టడం అమానుషమని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ మతుల కుటుంబాలకు టిడిపి నుంచి రూ.50 వేల సాయాన్ని చంద్రబాబు ప్రకటించారు.
                                            ఇన్ని కష్టాలు ఎప్పుడూ పడలేదు
           ఏడాదిగా పడిన కష్టాలు ఎప్పుడూ పడలేదని చంద్రబాబునాయుడు అన్నారు. గడిచిన ఏడాది ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయన్నారు. టిడిపి కార్యకర్తలు, నేతలపై కొన్ని వందల కేసులు పెట్టారని, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అరెండర్‌ అయ్యేలా చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లామని, అమరావతిని కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలనుకున్నానని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధికి అనుకూల పరిస్థితులు సృష్టించానని పేర్కొన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని, టిడిపి చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ రద్దు చేశారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడును ప్రారంభించింది ఎన్టీఆర్‌ హయాంలోనే అని చెప్పారు. రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలు ముఖ్యమన్నారు. కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే పని చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాడింది టిడిపినేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికే వైసిపి అధికారం కోసం ఒక్క అవకాశం అడిగారని అన్నారు. ఆనాడు పెట్టుబడుల కోసం ఎన్నో దేశాలు తిరిగానని, నేడు వైసిపి తీరు వల్ల రాష్ట్రంలో పెట్టుబడులన్నీ వెనక్కి పోతున్నాయని తెలిపారు. తాము ప్రవేశపెట్టిన 34 పథకాలు రద్దు చేశారన్నారు. వృద్ధులకు పింఛన్లు పెంచుతానని చెప్పి వైసిపి మోసం చేసిందన్నారు.