http://www.prajasakti.com/./mm/20200527//1590594048.nini.jpg

ఉత్తరాఖండ్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో పాముకాటుకు చిన్నారి మృతి

నైనిటాల్‌ : ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో పాముకాటులో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. థాల్లిసేథీ ప్రాంతంలోని బెటల్‌ఘాట్‌లో పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ముగ్గురు బాధ్యులపై కేసు నమోదు చేశారు. క్వారంటైన్‌ కేంద్రంలో బెడ్‌ల కొరత కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆ చిన్నారి కింద పడుకొని నిద్రిస్తుండగా తెల్లవారుజామున పాము కాటేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ సావిన్‌ బన్సాల్‌ తెలిపారు. బాలికను వెంటనే బెటల్‌ఘాట్‌ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తెసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, బాలిక మృతికి కారకులైన సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌పాల్‌సింగ్‌, విలేజ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ఉమేష్‌ జోషి, అసిస్టెంట్‌ ఉపాధ్యాయులు కరణ్‌ సింగ్‌లపై ఐపిసి 304ఎ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్‌ తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రం చుట్టుపక్కల దట్టమైన పొదలు ఉన్నాయని, సరైన సౌకర్యాలు లేవని ఎస్సై రాజ్‌పాల్‌ సింగ్‌కు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.