http://www.prajasakti.com/./mm/20200527//1590574270.madhu-2.jpg

మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో
రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్‌ వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు సంవత్సరాలుగా మానవ హక్కుల కమిషన్‌ పనిచేయడం లేదని, పౌరహక్కుల సంఘాలు కోర్టుకు వెళ్లగా నాలుగు నెలల్లో ఏర్పాటు చేయాలని అక్టోబర్‌ 30వ తేదీన ఎపి హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఏడు నెలలు దాటినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వివరించారు. అంతకుముందు అధికారంలో ఉన్న టిడిపి మూడేళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకొచ్చి సంవత్సరమయినా, కోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రత్యేకించి లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు అనేక విషయాలలో న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నారని, చౌకగా, సులువుగా పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే మానవ హక్కుల కమిషన్‌ నేడు అత్యవసరమని పేర్కొన్నారు. వెంటనే మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు, పౌరహక్కులు, ప్రజా సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయని, వెంటనే మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని మధు కోరారు.