http://www.prajasakti.com/./mm/20200527//1590547290.dhoni.jpg

ధోనీపై ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ బెన్‌స్టోక్స్‌ సంచలన వ్యాఖ్యలు

         లండన్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీపై ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించాలనే ఉద్దేశ్యం ధోనీలో కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ భాగస్వామ్యం విస్మయపరిచిందన్నాడు. స్టోక్స్‌ త్వరలో ఆవిష్కరించనున్న 'ఆన్‌ఫైర్‌' అనే పుస్తకంలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'లక్ష్య ఛేదనలో భారత్‌ విజయానికి 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైనప్పుడు ఎంఎస్‌ ధోనీ క్రిజులోకి వచ్చాడు. అప్పుడు అతడి ఆటలో అసలు తీవ్రతే కనిపించలేదు. సిక్సర్లు బాదడం కన్నా.. సింగిల్స్‌పైనే ఎక్కువ దష్టి సారించడం నన్ను ఆశ్చర్యపరిచింది. రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు కూడా భారత్‌కు గెలుపుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. ధోనీ భాగస్వామి కేదార్‌ జాదవ్‌లోనూ తీవ్రత కనిపించలేదు. నా వరకైతే విరుచుకుపడితేనే గెలుపుకు అవకాశాలు ఉంటాయి' అని స్టోక్స్‌ 'ఆన్‌ఫైర్‌' పుస్తకంలో రాశాడు. 'ధోనీ ఎప్పుడూ మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకు ఉండి గెలిపించాలనుకుంటాడు. ఓడిపోయే మ్యాచ్‌ల్లోనే మహీ చివరి వరకు నిలిచి లక్ష్యానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాడు. కీలక సమయంలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ భాగస్వామ్యం విస్మయపరిచింది. 27 ఓవర్లు క్రీజులో నిలిచి 138 పరుగులు మాత్రమే జోడించారు. మేం చాలా తెలివిగా బౌలింగ్‌ చేశామని తెలుసు. కానీ వారు బ్యాటింగ్‌ చేసిన విధానం మాత్రం విచిత్రంగా ఉంది. ఇద్దరు ఏమాత్రం గొప్పగా ఆడలేదు. వారు మాపై ఏ మాత్రం ఒత్తిడి పెంచే ఉద్దేశంతో కనిపించలేదు. దాంతో ఆట మా వైపు మళ్లింది' అని స్టోక్స్‌ 'ఆన్‌ఫైర్‌' పుస్తకంలో చెప్పుకొచ్చాడు.