కొత్త ప్రచ్ఛన్న యుద్ధం!
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన అమెరికా, కొత్త ప్రచ్ఛన్న యుద్ధం గురించి చర్చ రేకెత్తిస్తున్నది. ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం గనుక వస్తే అది అక్కడికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాపితంగా అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందులోనూ కరోనాతో ప్రపంచమంతా పోరాడుతున్న ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే పనిగా ప్రచ్ఛన్న యుద్ధం గురించి రంకెలేయడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. 'అమెరికా ఫస్ట్’, 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' వంటి నినాదాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ట్రంప్ తమ అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి తిరిగి గెలవడానికి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీని ద్వారా స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడంతో బాటు ఫైనాన్స్ పెట్టుబడి ప్రయోజనాలను కూడా కాపాడేందుకు పూనుకున్నాడు. ఫైనాన్స్ పెట్టుబడికి చోదక శక్తిగా ఉన్న నయా ఉదారవాద విధానాల్లో డొల్లతనాన్ని కరోనా వైరస్ బట్టబయలు చేసింది. ఒక వైపు ఫైనాన్స్ పెట్టుబడికి కేంద్రంగా ఉన్న అమెరికా, యూరపు దేశాలు కరోనాను ఎదుర్కోలేక ఎలా చతికిలపడినదీ, మరో వైపు వీటికి ప్రత్యామ్నాయంగా చైనా, క్యూబా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలు ఈ వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేసి, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి సజావుగా సాగిస్తూ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా ఎలా నిలిచిందీ చూస్తున్నాం. ప్రజారోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ, ప్రజలే తమ తొలి ప్రాధాన్యమని చైనా స్పష్టంగా ప్రకటించగా, కార్పొరేట్ల లాభాలే తనకు తొలి ప్రాధాన్యమన్నట్లు ట్రంప్ ప్రభుత్వం వ్యవహరించింది. ఫలితంగా కరోనా వైరస్‌కు అది ఇప్పుడు కేంద్ర స్థానంగా మారిపోయింది. నయా ఉదారవాద విధానాల పుణ్యమాని అమెరికాలో ప్రజారోగ్యం పడకేయడంతో కరోనా ఇప్పుడు అక్కడ విశ్వ రూపం చూపిస్తోంది. కరోనా బాధితులను ఆదుకోవడంలో ట్రంప్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇంకోవైపు జెఫ్ బెజో, జుకర్‌బర్గ్ వంటి 630 మంది అపర కుబేరుల సంపద 43,300 కోట్ల డాలర్ల మేర అదనంగా పెరగడానికి పూర్తి తోడ్పాటునందించింది. నాలుగు కోట్ల మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయి నిరుద్యోగ భృతి కోసం దేబిరిస్తుంటే వారికి ఉపాధి చూపడానికి బదులు కార్మిక చట్టాలను, హక్కులను మరింత బలహీనపరిచే చర్యలకు పూనుకుంది. విపత్తుల్లో పెట్టుబడిదారీ దేశాల్లో ప్రభుత్వాలు అనుసరించే విధానాలకు, సోషలిస్టు దేశాలు అనుసరించే విధానాలకు తేడా తెలుసుకునేందుకు ఇదొక ఉదాహరణ. అణ్వస్త్రాలను గుట్టలుగుట్టలుగా పేర్చుకున్న అమెరికా, కరోనాపై పోరుకు అవసరమైన వైద్య పరికరాలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, మందులను సమకూర్చడంలో అచేతనంగా ఉండిపోయింది. అమెరికా నేడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు మూలాలు అక్కడ ిఅమానుష పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉన్నాయి. వైద్యాన్ని కార్పొరేటీకరించడం వల్ల పేదలకు అది అందుబాటులో లేకుండా పోయింది. బహుళజాతి, కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లోకి ఔషధ రంగం వెళ్లిపోవడంతో మందులు సామాన్యులకు
అందుబాటులో లేని స్థితి. ప్రజారోగ్య రంగాన్ని ప్రభుత్వం నిర్వహించడం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం, సంపద పంపిణీలో అసమానతలు తొలగించడం వంటి చర్యలను నయా ఉదారవాద విధానాలు అనుమతించవు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే చర్యలు కొన్ని దేశాలు ఇప్పుడు చేపడుతున్నా అవి ఎంత కాలం కొనసాగుతాయన్నది ప్రశ్నార్థకమే. చరిత్రలో పెట్టుబడిదారీ వ్యవస్థే అంతిమం అని వాదించేవారికి కరోనా కనువిప్పు కలిగించింది. ఇప్పుడున్న ఈ వ్యవస్థ పనికిమాలినదని, ఇంతకన్నా మెరుగైన వ్యవస్థ కావాలని, భూగోళం ఇప్పుడున్న దానికన్నా మెరుగు పడాలని కోరుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నయా ఉదారవాద విధానకర్తలను అమితంగా ఆందోళనకు గురిచేస్తున్నది ఈ అంశమే. కాలం చెల్లిన ప్రచ్ఛన్న యుద్ధం గురించి అమెరికా మళ్లీ పాట పాడడానికి కారణమిదే. వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనాను అడ్డుకోవడం ద్వారా సోషలిస్టు శిబిరాన్ని దెబ్బ తీయాలని అమెరికా చూస్తున్నది. చైనా బలం అక్కడ అనుసరిస్తున్న ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో ఉన్నది. చైనా ఎదుగుదలను ప్రచ్ఛన్న యుద్ధంతో అడ్డుకోవడం అమెరికా తరం కాదు. హాంగ్‌కాంగ్‌లో జోక్యం, ఆర్థిక ఆంక్షలతో చైనాను దెబ్బ తీయాలని అమెరికా చేస్తున్న యత్నాలు బెడిసికొట్టక మానవు. అమెరికా, చైనాల మధ్య వైరుధ్యం...అపరిమితంగా సంపద పోగేసుకుంటున్న బడా కార్పొరేట్ల ప్రయోజనాలకు, దోపిడీకి బలవుతున్న శ్రామిక ప్రజల ప్రయోజనాలకు నడుమ పెరుగుతున్న వైరుధ్యానికి ప్రతిబింబమే. కనుక అమెరికా దూకుడుకు చెక్ పెట్టడంలోనే ప్రపంచ శామ్రిక జనావళి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఇది ప్రజా చైనాకు సంఘీభావం ప్రకటించాల్సిన తరుణం.