http://www.prajasakti.com/./mm/20200527//1590559254.Shoaib-Akhtar.jpg

సోయబ్‌ అక్తర్‌ను కోర్టుకు లాగుతా..!

      కరాచీ : పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి)పై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ సోయబ్‌ అక్తర్‌ను కోర్టుకు లాగుతానని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని బోర్డు లీగల్‌ అడ్వయిజరీ, సీనియర్‌ న్యాయవాది తుఫాజుల్‌ రిజ్వీ అన్నారు. ఈ ఏడాది జరిగే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సందర్భంగా తనను సంప్రదించిన బుకీల సమాచారాన్ని ఉమర్‌ అక్మల్‌ గోప్యగా ఉంచడంపై పిసిబి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా మూడేళ్లు అతనిపై నిషేధాన్ని కూడా విధించింది. దీనిపై స్పందించిన సోయబ్‌ అక్తర్‌.. ఉమర్‌ అక్మల్‌ విషయంలో పిసిబి తీసుకున్న నిర్ణయం ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ బోర్డుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తుఫాజుల్‌ రిజ్వీ స్పందించారు. బహిరంగ క్షమాపణలతో పాటు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలన్నారు. అంతే కాదు పరువునష్టం నోటీసులు కూడా పంపారు. తన న్యాయవాదితో కోర్టులో కేసు వేయిస్తానని అన్నాడు. ఇదిలా ఉండగా దీనిపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కూడా స్పందించింది. తుఫాజుల్‌ రిజ్వీ పంపిన నోటీసులకు, బోర్డుకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పింది. అది పూర్తిగా తుఫాజుల్‌ రిజ్వీ వ్యక్తిగతమని చెప్పింది. దీనిపై స్పందించిన సోయబ్‌.. బోర్టులో పనితీరు మెరుగుపరిచేందుకే ఆ వ్యాఖ్యలు చేశానని, రిజ్వీపై చేసిన వ్యాఖ్యలు చనువుతో చేసినవేనని, నోటీసులు పంపడం అర్థరహితమని అన్నారు. రిజ్వీనే నోటీసులు పంపి నన్ను అవమానించాడని, కాబట్టి అతనే క్షమాపణలు చెప్పాలని అన్నాడు.