https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/ad.jpg?itok=GpUhha4C
సంజయ్‌కుమార్‌ను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్న పోలీసులు

వరంగల్‌ జైలుకు సంజయ్‌ 



సాక్షిప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పది మంది హత్యకేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ను మంగళవారం పోలీసులు వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ వరంగల్‌ శాంతినగర్‌లోని గోనెసంచుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న మహమ్మద్‌ మక్సూద్‌ ఆలం, అతని కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిని భోజనంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేసిన విషయం తెలిసిందే. గొర్రెకుంట బావిలో తోసేసి తొమ్మిది మందిని, అంతకు ముందు ఒకరిని హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను వరంగల్‌ పోలీసులు మంగళవారం ఉదయం 3వ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో నిందితుడికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు. సంజయ్‌కుమార్‌ను హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచామని జైలు సూపరింటెండెంట్‌ మురళీబాబు తెలిపారు.  

మృతదేహాలకు వరంగల్‌లో అంత్యక్రియలు హత్యకు గురైన తొమ్మిది మందిలో ఏడుగురి అంత్యక్రియలను మంగళవారం ముస్లిం మత పెద్దలు వారి బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. మృతుడు మక్సూద్‌ బంధువులు ఉదయం పశ్చిమ బెంగాల్‌ నుంచి వరంగల్‌కు చేరుకోవడంతో పోలీ సులు మృతదేహాలను వారికి అప్పగించగా పోతనరోడ్డులోని శ్మశానవాటిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. షకీల్, మక్సూద్‌ ఆలం, అతని కుటుంబ సభ్యుల మృతదేహాలకు గీసుగొండ ఇన్‌చార్జి తహసీల్దార్‌ సుహాసిని, రాయపర్తి తహసీల్దార్‌ సత్యనారాయణ పంచనామా నిర్వహించారు. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌కుమార్‌ మృతదేహాలు ఎంజీఎంలోనే ఉన్నాయి. 

సమగ్ర విచారణకు మృతుల బంధువుల డిమాండ్‌.. 
మక్సూద్‌ బంధువులకు ఆరు మృతదేహాలను అప్పగించిన అనంతరం షకీల్‌ మృతదేహాన్ని తమకు ఇవ్వకపోవడంతో అతని భార్య తాహెరా బేగం పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టింది. షకీల్‌కు ఇద్దరు భార్యలు ఉండటంతో ఎవరికి మృతదేహం అప్పగించాలనే విషయంలో అధికారులు ఇబ్బందికి గురయ్యారు. షకీల్‌ మొదటి భార్యకు విడాకుల ప్రక్రియ పూ ర్తయిందని అతని సోదరుడు సజ్జర్‌ చెప్పడంతో అతని వివరణ తీసుకున్న తర్వాత రెండో భార్య తాహెరా బేగంకు మృతదేహాన్ని అప్పగించారు.  9 మందిని ఒక్కడే హతమార్చాడని పోలీసులు చెప్పడంపై పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చిన మక్సూద్‌ బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద నిషా సోదరుడు ఫిరోజ్‌షా మాట్లాడుతూ తొమ్మిది మందిని సంజయ్‌కుమార్‌ యాదవ్‌ హత్య చేశాడని పోలీసులు పేర్కొంటున్నారని, ఒక్కడే ఇంతమందిని ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. సంజయ్‌కుమార్‌కు మరికొంతమంది సహాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.