https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/mumbai.jpg?itok=4bn-9PT3

మహారాష్ట్రలో అనూహ్యం



సాక్షి ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మహారాష్ట్రను హడలెత్తిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేలు చేరడానికి రెండు నెలల సమయం పట్టగా, ఆ తర్వాత కేవలం 16 రోజుల్లో 30 వేల కేసులు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో సోమవారం కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 50 వేలు దాటింది. దేశవ్యాప్తంగా చూస్తే మే 25 నాటికి కరోనా బాధితుల సంఖ్య 1.38 లక్షలు ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే 50,231 మంది ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,635 మంది మృతి చెందారు.  

కోలుకున్నవారు 14,600 మంది...
రాష్ట్రంలో ఓ వైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండగా మరోవైపు కరోనా నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కోలుకున్న వారి సంఖ్య 29 శాతానికిపైగా ఉంది. ఇప్పటి వరకు 50 వేల మంది కరోనా బారిన పడగా 14,600 మందికి నయమైంది.  

ముంబైలో 30 వేల కేసులు..
రాష్ట్రంలో కేసులు 50 వేలు దాటగా వీటిలో ఒక్క ముంబైలోనే 30 వేలకుపైగా నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత డేంజర్‌ జోన్‌గా మారింది. నగరంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మే 17 వరకు 21 వేలు ఉండేది. గత వారం రోజుల్లో దీని బారినపడినవారి సంఖ్య మరో 10 వేలు పెరిగింది. దీంతో మే 24 నాటికి ముంబైలో కరోనా బారినపడిన వారి సంఖ్య 30,542కు చేరింది. 7,083 మంది వైరస్‌ నుంచి కోలుకోగా,  988 మంది దీని బారిన పడి మృతిచెందారు.  
ముంబైలో రైలు ఎక్కేందుకు
వేచి చూస్తున్న వలస కూలీలు