ఎల్‌జీ పాలిమర్స్ సీజ్
విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీని జిల్లా రెవిన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో ఈ నెల 7వ తేదీన జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా 585 మంది అస్వస్థతకు గురయ్యారు.
అయితే ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతోంది. ముందుగా కంపెనీని సీజ్ చేయడంతో పాటు డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎ.రామలింగరాజు, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రసాద్ ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కంపెనీని మూసివేసినట్లు ఆర్డీఓ తెలిపారు.