https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/sffff.jpg?itok=CyTHIzi6

వివాదాలు లేకుండా నిర్ణయాలు తీసుకోండి 



పెందుర్తి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తుల విక్రయాలకు సంబంధించి ఎటువంటి వివాదాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో ఆయన సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు శ్రీ శారదా పీఠం ప్రకటన విడుదల చేసింది.

ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి భక్తుల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలని స్వామీజీ కోరారు. పాలకమండలి నిర్ణయం భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఉండాలన్నారు. కాగా, సోషల్‌ మీడియా వేదికగా కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలంతో కొంతమంది పీఠంపై, తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని, వారిని ఉపేక్షించబోమని స్వామీజీ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో పోస్టుల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఏవో ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.