https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/26/tdp.jpg?itok=RpxOIi25

మాజీ విప్‌ ‘కూన’పై కేసు నమోదు



పొందూరు/సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్‌ చేస్తున్న వాహనాలను సీజ్‌ చేసినందుకు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్‌ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని టీడీపీ నేత కూన రవికుమార్‌ తహసీల్దార్‌ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్‌ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. స్పందించిన పోలీసులు రవికుమార్‌ కోసం ఆమదాలవలస, పొందూరు, శ్రీకాకుళంలలో సోమవారం వెదుకులాట ప్రారంభించారు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కూన రవికుమార్‌తోపాటు అతని సోదరుడు కూన వెంకటసత్యారావు, అచ్చిపోలవలస మాజీ సర్పంచ్‌ గురుగుబెల్లి జగన్నాథం, కాంట్రాక్టర్‌ చంద్రారెడ్డి, కాంట్రాక్టర్‌ అసిస్టెంట్‌ల మీద ఐపీసీ సెక్షన్‌ 353, 506 కింద కేసు నమోదు చేసినట్టు జె.ఆర్‌.పురం సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.

తక్షణం అరెస్టు చేయాలి: ఉద్యోగ సంఘాలు 
విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు రామకృష్ణను బెదిరించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సీజ్‌ చేసిన పొక్లెయిన్లు, టిప్పర్లను తక్షణమే వదిలేయాలంటూ మాజీ విప్‌ కూడా అయిన రవికుమార్‌ బెదిరించడం దారుణమన్నారు. ‘కూన రవికుమార్‌ ఇలా బెదిరింపులకు దిగడం, అధికారులను దుర్భాషలాడటం కొత్తకాదు. ఆయన వ్యవహార శైలి అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది.  

అందువల్ల ఆయన గత చరిత్రను పరిగణనలోకి తీసుకుని పీడీ చట్టం కింద చర్యలు తీసుకుని అరెస్టు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు పాల్పడకుండా కూన రవికుమార్‌పై పీడీ చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి, వి.గిరికుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.